టీడీపీకి మరో షాక్ తప్పదా.. బీజేపీ గూటికి కీలక నేత? తిరుపతి ఎంపీగా పోటీ

అది సాధ్యపడపోతే.. తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి కేంద్ర పెద్దలకు దగ్గర కావచ్చన్న ప్లాన్‌లో కూడా టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 30, 2020, 11:30 AM IST
టీడీపీకి మరో షాక్ తప్పదా.. బీజేపీ గూటికి కీలక నేత? తిరుపతి ఎంపీగా పోటీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(రఘు అన్నా , న్యూస్ 18 కరెస్పాండెంట్)

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై ఏపీలో అప్పుడే చర్చ మొదలయింది. ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీకి మరో బిగ్ షాక్ తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీచేసిన ఓడిపోయి పనబాక లక్ష్మీ.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీి వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.

వైసీపీ సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కరోనా వైరస్‌తో మరణించారు. ఆయన మరణంతో ఖాళీ అయిన లోక్‌సభ స్ధానానికి జనవరి తర్వాత ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించే అవకాశముంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్ధులపై దృష్టిసారిస్తున్నాయి. ఎవరికీ బలమైన అభ్యర్ధి లేకపోవడం, ఎస్సీ రిజర్వుడు సీటు కావడంతో ఇక్కడ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

మరోవైపు ఉపఎన్నిక జరిగితే సంప్రదాయం పేరు చెప్పి టీడీపీ తప్పించుకునే అవకాశముందన్న వాదన కూడా వినిపిస్తోంది. రాజకీయనాయకుడు ఎవరైనా మృతి చెందితే ఆ స్థానాన్ని వారి కుటుంబసభ్యులకు కేటాయించే పక్షంలో ఏకగ్రీవ ఎన్నికకు మిగతా రాజకీయపార్టీలు తమ అభ్యర్ధులను పోటీ పెట్టకుండా సహకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పోటీ చేయకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పనబాక లక్ష్మి మాత్రం ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెవులు కొరుక్కుంటున్నారట. ఈ క్రమంలోనే ఆమె బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ పనబాక లక్ష్మి బీజేపీ నుంచి పోటీచేస్తే.. టీడీపీ కూడా అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశముంది. మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు అవకాశం ఇవ్వవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ శివప్రసాద్‌ కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించే అవకాశముంది. అది సాధ్యపడపోతే.. తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి కేంద్ర పెద్దలకు దగ్గర కావచ్చన్న ప్లాన్‌లో కూడా టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ అధికార వైసీపీని తట్టుకుని పోటీలో నిలబడి గెలవడం అంత ఈజీ కాదు. అందుకే బీజేపీకి మద్దతిస్తే.. గెలుపోటములతో సంబంధం లేకుండా కేంద్రానికి చేరువ కావచ్చని యోచిస్తున్నారట.

ఒకవేళ పనబాక బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసి.. టీడీపీ మద్దతు ఇస్తే మాత్రం.. వైసీపీకి గట్టిపోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య వైసీపీ ఎవరిని బరిలోకి దింపుతారన్నది హాట్ టాపిక్‌గా మారనుంది. ఏది ఏమైనా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు జరిగితే సంప్రదాయానికి కట్టుబడి అన్ని రాజకీయపార్టీలు పోటీకి దూరంగా ఉంటాయా లేక పనబాకను అక్కున చేర్చుకుని బీజేపీ పోటీలో నిలుచుంటుందా అనే విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
Published by: Shiva Kumar Addula
First published: September 30, 2020, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading