AP Politics: టీడీపీకి మరో షాక్.. కమలం గూటికి మాజీ కేంద్ర మంత్రి?

AP Politics: టీడీపీకి మరో షాక్.. కమలం గూటికి మాజీ కేంద్ర మంత్రి?

పనబాక లక్ష్మి

AP Politics: ఏపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి త్వరలో టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. తిరుపతి పార్లమెంట్ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉంటారని తెలుస్తోంది.

 • Share this:
  కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి అతి త్వరలో పార్టీ మారనున్నారా? సైకిల్ దిగి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔను అనే తెలుస్తోంది. గతంలో నెల్లూరు నుంచి రెండు సార్లు, బాపట్ల నుంచి ఒక సారి ఆమె 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి గా పనిచేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ,జౌళి తదితర మంత్రిత్వ శాఖలను ఆమె నిర్వర్తించారు. ఇలా కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన పనబాక లక్ష్మి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో టీడీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఆమె మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు(అక్టోబర్ 6) ఆమె జన్మదినం సందర్భంగా భారీగా వేడుకలను నిర్వహించేందుకు ఆమె అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ వేడుకల్లోనే ఆమె పార్టీ మార్పునకు సంబంధించిన ప్రకటన ఉండొచ్చన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆమె బీజేపీలో చేరి తిరుపతి ఎంపీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

  తిరుపతి వైసీపీ సిట్టింగ్‌ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కరోనా బారిన పడి మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఖాళీ అయిన లోక్‌సభ స్థానానికి జనవరి తర్వాత ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించే అవకాశముంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అభ్యర్థులపై దృష్టి సారిస్తున్నాయి. ప్రస్థుతానికి ఏ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడం, ఎస్సీ రిజర్వుడు సీటు కావడంతో ఇక్కడ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయనాయకుడు ఎవరైనా మృతి చెందితే ఆ స్థానాన్ని వారి కుటుంబసభ్యులకు కేటాయించే పక్షంలో ఏకగ్రీవ ఎన్నికకు మిగతా రాజకీయపార్టీలు తమ అభ్యర్ధులను పోటీ పెట్టకుండా సహకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పోటీ చేయకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పనబాక లక్ష్మి మాత్రం ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


  ఒకవేళ పనబాక లక్ష్మి బీజేపీ నుంచి పోటీచేస్తే.. టీడీపీ కూడా అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశముంది. మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు అవకాశం ఇవ్వవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ శివప్రసాద్‌ కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించే అవకాశముంది. అది సాధ్యపడపోతే.. తిరుపతిలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించి కేంద్ర పెద్దలకు దగ్గర కావచ్చన్న ప్లాన్‌లో కూడా టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పనబాక బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసి.. టీడీపీ మద్దతు ఇస్తే మాత్రం.. వైసీపీకి గట్టిపోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య వైసీపీ ఎవరిని బరిలోకి దింపుతారన్నది హాట్ టాపిక్‌గా మారనుంది. ఏది ఏమైనా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలు జరిగితే సంప్రదాయానికి కట్టుబడి అన్ని రాజకీయపార్టీలు పోటీకి దూరంగా ఉంటాయా లేక పనబాకను అక్కున చేర్చుకుని బీజేపీ పోటీలో నిలుచుంటుందా అనే విషయం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
  Published by:Nikhil Kumar S
  First published:

  అగ్ర కథనాలు