మోదీ సర్కార్ అసమర్థత వల్లే.. దేశ ఆర్థిక పరిస్థితిపై చిదంబరం

ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఒకవేళ జీడీపీ వృద్దిరేటు 5శాతానికి చేరితే మనం అదృష్టవంతులమని చిదంబరం అన్నారు. కానీ సుబ్రహ్మణ్యస్వామి చెప్పే మాటలను కూడా గుర్తెరగాలని సూచించారు.

news18-telugu
Updated: December 5, 2019, 1:13 PM IST
మోదీ సర్కార్ అసమర్థత వల్లే.. దేశ ఆర్థిక పరిస్థితిపై చిదంబరం
ఆర్థికమంత్రి పి.చిదంబరం(File)
  • Share this:
బుధవారం రాత్రి 8 గంటలకు తీహార్ జైలు నుంచి బయటకొచ్చి స్వేచ్చా వాయువులు పీల్చుకున్నప్పుడు తాను మొదట ఆలోచించింది 75 లక్షల మంది కశ్మీర్ ప్రజల గురించేనని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు.ఈ ఏడాది అగస్టు 4వ తేదీ నుంచి స్వాతంత్య్రం కోల్పోయిన అక్కడి ప్రజల కోసం ప్రార్థించానన్నారు. 'స్వేచ్చ అనేది విడదీయరానిది.. మన స్వేచ్చను మనం కాపాడుకోవాలంటే వాళ్ల స్వేచ్చ కోసం కూడా పోరాడాలి' అని కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే చార్జిషీట్ లేకుండా అరెస్ట్ అవుతున్న రాజకీయ నాయకుల గురించి కూడా తాను ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక స్థితిపై ఎప్పుడూ మౌనంగానే ఉంటున్నారని చిదంబరం వ్యాఖ్యానించారు. ఆ వ్యవహారాలన్నీ మంత్రులకు వదిలేశారన్నారు. ఫలితంగా ఆర్థిక నిపుణులు చెప్పినట్టు దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఒకవేళ జీడీపీ వృద్దిరేటు 5శాతానికి చేరితే మనం అదృష్టవంతులమని చిదంబరం అన్నారు. కానీ సుబ్రహ్మణ్యస్వామి చెప్పే మాటలను కూడా గుర్తెరగాలని సూచించారు. దేశ అసలు జీడీపీ 5శాతం కాదని,1.5శాతం కంటే తక్కువ ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. తాను కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసినప్పుడు ఆర్థిక వ్యవహారాల పట్ల తాను చాలా స్పష్టంగా వ్యవహరించేవాడినని చెప్పారు. చాలామంది జర్నలిస్టులు,అధికారులకు ఈ విషయం తెలుసన్నారు.

కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం రాజ్యసభ సమావేశాలకు చిదంబరం హాజరయ్యారు.తీహార్ జైల్లో 106 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం రాత్రి ఆయన విడుదలయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎట్టకేలకు జైలు నుంచి ఆయనకు విముక్తి లభించింది.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>