
ప్రతీకాత్మక చిత్రం (Image;Reuters)
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకాశ్మీర్‌కు బయట నుంచి రాజకీయ నేతలను అనుమతించడం ఇదే తొలిసారి.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మరికొందరు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు నేడు శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, 35A ను ఇటీవల కేంద్రం రద్దు చేసింది. దీంతో అప్పటి నుంచి జమ్మూకాశ్మీర్‌లో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంది. కొన్ని ఆంక్షలు కూడా విధించి.. ఆ తర్వాత సడలించారు. న్యూస్18కి అందుతున్న సమాచారం ప్రకారం... కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, సీపీఐ తరఫున డి.రాజా, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, ఆర్జేడీ తరఫున మనోజ్ ఝా, ఎన్సీపీ తరఫున దినేష్ త్రివేదీ శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ఒకవేళ భద్రతా అధికారులు ఆదేశిస్తే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గురువారం రోజు విపక్షాలకు చెందిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశాయి. జమ్మూకాశ్మీర్‌లో నిర్బంధంలో ఉంచిన నేతలను వెంటనే రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకాశ్మీర్‌కు బయట నుంచి రాజకీయ నేతలను అనుమతించడం ఇదే తొలిసారి.
Published by:Ashok Kumar Bonepalli
First published:August 24, 2019, 03:34 IST