ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న టీడీపీకి మరో భారీ షాక్ తగులుతోంది. ఓ సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. బీజేపీ.. ఆపరేషన్ కమల్ దెబ్బకు ఆ పార్టీ ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజ్యసభలో బీజేపీలో టీడీపీ విలీనం అయ్యింది. ఇప్పుడు గుంటూరు టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న రాయపాటి సాంబశివరావు కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాను త్వరలోనే బీజేపీలో చేరతానని ప్రకటించారు. వాస్తవానికి రాయపాటి టీటీడీ ఛైర్మన్ పదవి మెలికతోనే టీడీపీలో చేరారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ పదవి పుట్టా సుధాకర్ యాదవ్‌కు దక్కింది. దీంతో అప్పటి నుంచి రాయపాటి గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు సరైన సమయం చూసి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు, రాయపాటిని బీజేపీలో చేర్చుకునేందుకు ఇటీవల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ రెండు రోజుల క్రితం రాయపాటి నివాసానికి వచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయనకు రాయపాటి విందు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కాగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్ ఉన్న రాయపాటిని చేర్చుకోవడం ద్వారా పార్టీని పటిష్ఠం చేయాలని బీజేపీ భావిస్తోంది. రాంమాధవ్ కూడా నేరుగా తమ పార్టీలో చేరాల్సిందిగా రాయపాటిని కోరినట్లు తెలిసింది. ఇప్పటికే కేడర్ కాషాయమయం అవుతుండటంతో టీడీపీ తలలు పట్టుకుంటోంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:July 22, 2019, 11:02 IST