తమిళనాట ‘ఆపరేషన్ కమలం’...డీఎంకేను కలవరపెడుతున్న బీజేపీ

అయోధ్యలో రామాలయ భూమిపూజలో బీజేపీ నేతలందరూ తలమునకలై ఉన్న సమయంలో డీఎంకే ఎమ్మెల్యే సెల్వం చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. డీఎంకే కుటుంబ పార్టీగా మారిందని ఆరోపించిన ఆయన...త్వరలోనే బీజేపీ తీర్థంపుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 5, 2020, 5:03 PM IST
తమిళనాట ‘ఆపరేషన్ కమలం’...డీఎంకేను కలవరపెడుతున్న బీజేపీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మరో 8 మాసాల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కమలనాథులు ఇప్పటి నుంచే అక్కడ ‘ఆపరేషన్ కమల్’ మొదలు పెట్టేశారు. అయోధ్యలో రామాలయ భూమిపూజలో బీజేపీ నేతలందరూ తలమునకలై ఉన్న వేళ డీఎంకే ఎమ్మెల్యే సెల్వం చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. డీఎంకే కుటుంబ పార్టీగా మారిందని ఆరోపించిన ఆయన...త్వరలోనే బీజేపీ తీర్థంపుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెప్పకనే చెప్పారు. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన సెల్వం...బీజేపీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సెల్వంను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఆయన పార్టీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆరోపించారు. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలంటూ సెల్వంకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

tamilnadu politics, tamilnadu political news, mk stalin, dmk mla selvam, operation lotus, operation kamal, ఆపరేషన్ కమలం, ఎంకే స్టాలిన్, డీఎంకే బీజేపీ, ఎమ్మెల్యే సెల్వం
డీఎంకే ఎమ్మెల్యే సెల్వంతో ఎంకే స్టాలిన్(ఫైల్ ఫోటో)


తమిళనాడులో ఎన్నికల నాటికి ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలుండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు పలువురు నేతలతో బీజేపీ అధినాయకత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యే సెల్వం తర్వాత మరికొందరు డీఎంకే ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసి... బీజేపీ గూటికి చేరొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రధాన కార్యాలయం(అన్నా అరివాలయం)లో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

ఢిల్లీలో జేపీ నడ్డాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సెల్వం...అయోధ్యలో రామాలయ నిర్మాణం శంకుస్థాపన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. అయోధ్యలానే తమిళనాడులోని రామేశ్వరం అభివృద్ధికి చొరవచూపాలని కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఎంకే స్టాలిన్ ముందు మూడు డిమాండ్లు ఉంచారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని, కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకోవాలని, సుబ్రహ్మణ్య స్వామిని అవమానించేలా కరుప్పర్ కూట్టం యూట్యూబ్ వీడియోను విడుదల చేయటాన్ని ఎంకే స్టాలిన్ ఖండించాలని డిమాండ్ చేశారు.

కరోనా కారణంగా ఇటీవల మరణించి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ స్థానంలో చెన్నై పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవిని తనను కాదని...స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు సన్నిహితుడైన ఎన్.చిత్రరసును నియమించడమే ఎమ్మెల్యే సెల్వం అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించకుండా పార్టీ కార్యదర్శి పదవులను తమకు ఇష్టమైనవారికి కేటాయిండం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకి అధికార అన్నాడీఎంకే గట్టి పోటీ ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయం నెలకొంటోంది. దీంతో డీఎంకే విజయం నల్లేరుపై నడక కావచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నాయి. అయితే అక్కడ బీజేపీ కూడా అధికార పగ్గాల కోసం పావులు కదుపుతుండటం డీఎంకే అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.
Published by: Janardhan V
First published: August 5, 2020, 4:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading