జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా హైదరాబాద్ రావడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారం చేయడానికి కేవలం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కరు మాత్రమే మిగిలి పోయారని వ్యాఖ్యానించారు. శనివారం లంగర్ హౌస్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. "ఇవి జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగా లేవు. ప్రధాని నరేంద్ర మోదీలాగా ఒక్క దేశ ప్రధాని కోసం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఓ బాలుడు ట్రంప్‌ను కూడా పిలవాల్సింది అని అన్నాడు. అతడు చెప్పింది నిజమే. కేవలం ట్రంప్ మాత్రమే మిగిలి ఉన్నాడు" అని అన్నారు. అలాగే ఎంఐఎం అభ్యర్థుల తరఫున అసదుద్దీన్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమలంలోనే ఎంఐఎంపై బీజేపీ చేసే విమర్శలను ఆయన తిప్పికొడుతున్నారు.
మజ్లిస్‌ను మతతత్వ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసుదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మతం ఉండదని.. కానీ ఇప్పుడు దాన్ని ఒక మతంతో జోడిస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో స్థానిక సమస్యలపై స్పందించకుండా.. రోహింగ్యాలు, ఉగ్రవాదం, సర్జికల్ దాడులపై మాట్లాడుతున్నారని అసద్ మండిపడ్డారు. తమ పార్టీ మనసులు కలిపే ప్రయత్నం చేస్తోందని.. మనసులను విడగొట్టేలా చేయదని చెప్పారు. GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విదేశీ అగ్రనేతల ప్రస్తావన..
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ఆ పార్టీకి చెందిన పలువురు జాతీయ నాయకులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం కేంద్ర అమిత్ షా హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, నేటి సాయంత్రంతో గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.