నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఎమ్మెల్సీగా బరిలోకి దిగబోతున్నారు. ఇందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం... ఆమె ఇందుకోసం నామినేషన్ వేయడం కూడా జరిగిపోయాయి. ఎమ్మెల్సీగా కవిత గెలవడం కూడా లాంఛనమే. ఇంతవరకు బాగానే ఉన్నా... కవితను కేసీఆర్ తన కేబినెట్లోకి తీసుకుంటారా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మరో కీలకమైన విషయం ఏమిటంటే... తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతానికి ఖాళీలు లేవు. కేసీఆర్‌ను కలుపుకుని మొత్తం 18 మందితో తెలంగాణ కేబినెట్ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో కవితను మంత్రిని చేయాలంటే... ఎవరో ఒకరు తమ కేబినెట్ పదవిని వదులుకోవాల్సి వస్తుంది. దీంతో కవిత కోసం మంత్రి పదవి వదులుకోవడానికి సిద్ధమయ్యే ఆ నాయకుడు ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ ఇద్దరు మహిళలు మంత్రులుగా కొనసాగుతున్నారు. అందులో ఒకరు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కాగా, మరొకరు గిరిజన సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో వీరిలో ఏ ఒక్కరిని కేసీఆర్ పక్కనపెట్టే అవకాశం లేదు. కవిత కోసం బీసీ మంత్రులను పక్కనపెట్టే సాహసం కేసీఆర్ చేయకపోవచ్చని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి... కవిత కోసం తన మంత్రి పదవిని త్యాగం చేస్తారా ? అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. ప్రశాంత్ రెడ్డి కేసీఆర్‌కు సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అందుకే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా... ప్రశాంత్ రెడ్డిని కేబినెట్’లోకి తీసుకున్నారు గులాబీ బాస్. మరి... కవితకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్ పక్కనపెడతారా ? అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కేబినెట్లోకి రావాలంటే ఎవరో ఒకరు తమ పదవిని వదులుకోవాల్సి రాక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే తాను తప్పుకుని తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అదే నిజమైతే... ఆ సమయంలోనే కేసీఆర్ తన కూతురు కవితను కేబినెట్ బెర్త్ ఇప్పించే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.