గతంలో ఆయన పేరుకు ప్రాంతీయ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడే అయినా జాతీయ రాజకీయాలను దాదాపు శాశించారు.. దేశ ప్రధానమంత్రిగా ఎవరుండాలో నిర్ణయించారు.. ఆయన ఎవరిని సూచిస్తే ఆయనే భారత ప్రథమ పౌరుడయ్యారు.. కేంద్ర కేబినెట్ లో బెర్తుల దగ్గర్నుంచి, కేంద్ర సంస్థల అధిపతుల దాకా ఆయన రికమండేషన్లు నడిచేవి.. న్యాయవ్యవస్థతోనూ సత్సంబంధాలు కలిగిన నేతగా ప్రత్యర్థులు చెప్పుకునేవారు.. అవును, మనం మాట్లాడుతున్నది టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గురించే. ప్రాంతీయ పార్టీ అధినేతగానే ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన ఆయన.. ఇప్పుడు జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి కూడా కేంద్రం పెద్దలను కలవలేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనపై తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ స్థాయిలోనూ ఇప్పుడిదే చర్చ జరుగుతోంది..
ఏపీలో రాష్ట్రపతి పాలన
ఆంధ్రప్రదేశ్ లో పెనుదుమారం రేపిన ‘బోషిడికే’ వివాదం, దాని అనంతర పరిస్థితులు, జగన్ సర్కారు ప్రాయోజిత ఉగ్రవాద చర్యలు, గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రం లూటీ అవుతోన్న తీరును కేంద్రానికి వివరించి, వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేలా చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనకు వచ్చానని చంద్రబాబు స్వయంగా తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన ఆయన.. పలువురు టీడీపీ ఎంపీలను వెంటేసుకుని రాష్ట్రపతి భవన్ వెళ్లారు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి సంబంధించిన రుజువులు, రాష్ట్రపతి పాలన అవసరతను వివరిస్తూ రామ్ నాధ్ కోవింద్‌ను 8 పేజీల మెమోరాండంను అందజేశారు చంద్రబాబు. అంతేకాదు, జగన్ ఉగ్రచర్యలంటూ పేర్కొన్న 323 పేజీల పుస్తకాన్ని కూడా రాష్ట్రపతికి అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలనూ కలుస్తామన్నారు. కానీ..
మొఖం చాటేసిన మోదీ, షా
ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు మొత్తం మూడు రోజులు ఢిల్లీలో ఉండాల్సిఉన్నా.. మంగళవారం సాయంత్రమే ఆయన హైదరాబాద్ తిరిగొచ్చేశారు. రెండు రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులుగాస్తున్నప్పటికి చంద్రబాబుకు నిరాశే ఎదురైనట్లు తెలిసింది. పలు రివ్యూ మీటింగ్స్ లో ప్రధాని మోదీ బిజీగా ఉండటంతో కనీసం హోం మంత్రితోనైనా చంద్రబాబు భేటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ కశ్మీర్ పర్యటన ముగించుకుని అమిత్ షా ఢిల్లీకి వచ్చినప్పటికి.. చంద్రబాబుకు మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. వీళ్లిద్దరూ కాకుండా నిర్మలా సీతారామన్ లాంటి ఇతర కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా చంద్రబాబుకు అనుకూలత దొరకలేదని సమాచారం. జగన్ పై పోరులో చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనను అత్యంత కీలకంగా, సీరియస్ గా భావించిన టీడీపీకి.. కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా కేంద్రం పెద్దలు షాకిచ్చినట్లయిందని కామెంట్లు వస్తున్నాయి. అయితే టీడీపీ వర్గాలు మాత్రం... అమిత్ షా టైమిస్తే చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వస్తారని చెబుతున్నాయి.
టీడీపీ-బీజేపీ పొత్తు
జగన్ పై పోరులో తన ఒక్కడి బలం సరిపోదని భావిస్తోన్న చంద్రబాబు.. తిరిగి బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారని, తాజా ఢిల్లీ పర్యటనలో అదే విషయాన్ని కేంద్రం పెద్దలకు నేరుగా చెప్పే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీపై వ్యక్తిగత దూషణలు, తిరుపతిలో అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లు తదితర ఘటనల ప్రస్తావన కూడా ఈ సందర్భంలో జరుగుతున్నది. టీడీపీతో తిరిగి దోస్తీ కట్టాలా వద్దా అనే విషయంలో బీజేపీ కచ్చితమైన స్టాండ్ తీసుకుందని, కాబట్టే బోషిడికే వివాదంపైగానీ, చంద్రబాబు ఢిల్లీ పర్యటననుగానీ కమలనాథులు పెద్దగా పట్టించుకోలేదనే కామెంట్లు వస్తున్నాయి.
శాశ్వత శతృవులు కారు..
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేది వాస్తవమే అయినా, పనికిరాని మిత్రుడు కూడా అవసరం లేదనే థియరీని బీజేపీ అనుసరిస్తున్నదా? స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తర్వాత ఇక టీడీపీతో ఏనాడూ పొత్తు పెట్టుకోవద్దనే నిర్ధారణకు బీజేపీ వచ్చిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అపాయింట్మెంట్ నిరాకరణ ద్వారా చంద్రబాబు ప్రస్తుత పరిస్థితిని అందరికీ తెలియజెప్పాలనే కేంద్రం పెద్దలు వ్యవహరించి ఉండొచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నింటి నముడ చంద్రబాబు ఏ విధంగా ముందకు పోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Bjp, Bjp-tdp, Chandrababu Naidu, TDP