సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ...ఒకప్పుడు బద్ధ శత్రువులు..! ఇప్పుడు మిత్రులుగా మారి బీజేపీని ఢీకొంటున్నాయి. బీజేపీకి ధీటుగా ఎన్నికల ప్రచారం చేస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మణిపురి(యూపీ)లో ఎస్పీ-బీఎస్పీ కూటమి ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ సభకు ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకానున్నారు. 25 ఏళ్ల ఇరువురు నేతలు వేదికను పంచుకోబోతుండడం విశేషం.
ఈ సందర్భంగా మణిపూర్‌లోని ములాయం సోదరుడి ఇంటికి మాయవతి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా తామంతా కలిసే ఉన్నామని సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ ఓట్లు మహాకూటమి అభ్యర్థులకే పడేలా.. ఓట్లు చీలిపోకుండా వ్యూహం రచిస్తున్నారు. ఈ ర్యాలీకి RLD చీఫ్ అజిత్ సింగ్ సైతం హాజరుకానున్నారు.
గతంలో బద్ధ శత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలుగు చేతులు కలిపేందుకు పాతికేళ్ల సమయం పట్టింది. 25 ఏళ్ల క్రితం ములాయం సింగ్ యాదవ్, కాన్షీరాం కలిసి పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయోధ్య ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న సమయంలో బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు 1993లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీచేశాయి. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 109, బీఎస్సీ 67 స్థానాల్లో గెలిచాయి. బీజేపీ 177 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎస్పీ-బీఎస్పీ పార్టీలు చిన్నా చితకా పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి.
ఐతే వారి సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు సజావుగా సాగలేదు. 1995లో బీజేపీతో మాయావతి చర్చలు జరుపుతోందన్న సమాచారం అందడంతో ఎస్పీ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఓ గెస్ట్ హౌస్‌లో బీస్పీ సమావేశం జరుగుతోందని తెలిసి ఎస్పీ కార్యకర్తలు చేరుకున్నారు. సమావేశ గదిలోకి వెళ్లి బీఎస్పీ నేతలపై దాడులు చేశారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు మాయావతి ఓ గదిలోకి వెళ్లి తలుపువేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అనంతరం ఇరుపార్టీలు విడిపోయాయి.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఎస్పీ, బీఎస్పీని అఖిలేశ్ యాదవ్, మాయావతి కలిపారు. గెస్ట్‌హౌస్ ఘటనను సైతం పక్కనబెట్టి స్నేహం చేశారు. గోరఖ్‌పూర్, కైరానా లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పోటీచేసి బీజేపీకి షాకిచ్చారు. బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో గెలిచి తమ సత్తా చూపించారు. అదే ఫార్ములాను ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలుచేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసిపనిచేసి..బీజేపీ గద్దె దింపాలని వ్యూహం రచిస్తున్నారు.
80 లోక్‌సభ సీట్లున్న యూపీలో ఎస్పీ-బీస్పీ-ఆర్ఎల్డీ నేతృత్వంలోని మహాకూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఎస్పీ 37, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీచేస్తుండగా ఆర్ఎల్డీ 3 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఐతే కాంగ్రెస్‌తో ఎలాంటి ప్రిపోల్ ఒప్పందం లేకున్నప్పటికీ అమేథీ, రాయ్బేరేలి స్థానాలను వదిలేశారు. ఈ రెండు చోట్ల మహాకూటమి తరపున అభ్యర్థులను బరిలోకి దించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhilesh Yadav, Bsp, Lok Sabha Election 2019, Mayawati, Sp-bsp, Uttar Pradesh Lok Sabha Elections 2019