బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏకాకిగా మారిన హస్తం పార్టీకి మరో షాక్ తగిలింది. బిజు జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న మహాకూటమిలో భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో ఎవరితో చేరుతామనే అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు మరికొంత సమయం కావాలని.. 24 గంటల ముందు చెప్పిన నవీన్ పట్నాయక్.. ఈ విషయమై తొందరగానే క్లారిటీ ఇచ్చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటువుతున్న మహా ఘట్‌బంధన్‌లో తాము భాగస్వామ్యం కాబోవడం లేదని ప్రకటించారు.
మద్దతు ధరకోసం ఢిల్లీలో మంగళవారం రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న నవీన్ పట్నాయక్.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. దేశ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. దీంతో, నవీన్ పట్నాయక్ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, దీనిపై స్పందించిన నవీన్.. మహాకూటమి విషయమై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలని చెప్పారు. 24 గంటలు గడవక ముందే ఆయన ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. మహాకూటమిలో బిజు జనతాదళ్ భాగం కావడం లేదని స్పష్టం చేశారు.
అయితే, బీజేపీతో కూడా తాము కలవబోమని చెప్పారు నవీన్ పట్నాయక్. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటించే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. దీంతో, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతారా? అనే చర్చకు తెరలేచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్.. ఒడిశా వెళ్లి నవీన్ పట్నాయక్‌ను కలిశారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ కూటమి ఏర్పాటుపై చర్చించారు. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ తాజా నిర్ణయం ఫెడరల్ ఫ్రంట్‌ను బలపర్చడం కోసమేనా? అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. అదే నిజమే అయితే, ఫెడరల్ ఫ్రంట్‌కు తొలి అడుగు పడినట్టేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Congress, Lok Sabha Election 2019, Mahakutami, Narendra modi, Naveen Patnaik, Odisha, Odisha Assembly Election 2019, Odisha Lok Sabha Elections 2019