కేంద్ర వైఫల్యాలు, స్కాంలపై కాంగ్రెస్ వీధిపోరాటం!

2005-2013 మధ్యకాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం 82,728 మంది అక్రమ విదేశీ వలసదారులను (బంగ్లాదేశీయులు) వారి స్వదేశాలకు తిప్పిపంపగా...మోదీ సర్కారు గత నాలుగేళ్లలో కేవలం 1,822 మంది విదేశీయులను వారి స్వదేశాలకు తప్పిపంపినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

news18-telugu
Updated: August 4, 2018, 9:19 PM IST
కేంద్ర వైఫల్యాలు, స్కాంలపై కాంగ్రెస్ వీధిపోరాటం!
దిల్లీలో శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లెట్, ఏకే ఆంటోనీ
  • Share this:
అస్సాం ఎన్నార్సీని రాజకీయం చేయడం ద్వారా ప్రజలను మూర్ఖులను చేయాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అస్సాం ఎన్నార్సీ విషయంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆకాంక్షే తప్ప...అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపాలన్న చిత్తశుద్ధి మోదీ ప్రభుత్వానికి లేదని విమర్శించింది. దేశ రాజధాని దిల్లీలో శనివారం జరిగిన నూతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు జాతీయ రాజకీయ అంశాలపై చర్చించారు. వచ్చే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధంకావడంపై చర్చించారు. రఫెల్ డీల్, పీఎన్‌పీ స్కాం, అస్సాం ఎన్నార్సీ అంశాలపై వీధి పోరాటాలు చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.

రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు అశోక్ గెహ్లెట్, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, అంబికా సోని, ముకుల్ వాస్నిక్ తదితరులు హాజరయ్యారు. పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.  ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ కుంభకోణాలపై ప్రజా క్షేత్రంలో మోదీ సర్కారును ఎండగట్టాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మోదీ సర్కారు ఘోరంగా విఫలం చెందిందని, అలాగే మోదీ ప్రభుత్వ అవినీతిని ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.

2005-2013 మధ్యకాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం 82,728 మంది అక్రమ విదేశీ వలసదారులను (బంగ్లాదేశీయులు) వారి స్వదేశాలకు తిప్పిపంపగా...మోదీ సర్కారు గత నాలుగేళ్లలో కేవలం 1,822 మంది విదేశీయులను వారి స్వదేశాలకు తప్పిపంపినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఇవాళ్టి సమావేశంలో రఫెల్ దోపిడీ గురించి ఏకే ఆంటోనీ చెప్పిన వివరాలు హైలైట్‌గా నిలిచాయి. రూ.1,30,000 కోట్ల ప్రజా ధనాన్ని దోపిడీ చేసి, రూ.45,000 కోట్ల అప్పుల్లో ఉన్న ఫ్రెండ్‌కు అప్పగించారంటూ రాహుల్ గాంధీ మరో ట్వీట్ చేశారు.

1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రతిపాదించినట్లు అస్సాంలో పౌర గణనను చేపట్టేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా స్పష్టంచేశారు. బ్యాంకు స్కాంలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చి, వచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న కుటిల ఆలోచనతో మోదీ సర్కారు అస్సాం ఎన్నార్సీ అంశాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు. అసలైదన భారత పౌరుడు ఎవరూ అస్సాం ఎన్నా్ర్సీలో చోటు కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు.

మోదీ ప్రభుత్వ వైఫల్యాలు, అసోం ఎన్నార్సీ, బ్యాంకు కుంభకోణాలు, మోదీ ప్రభుత్వ అవినీతి గురించి చర్చించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లెట్ తెలిపారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై కూడా చర్చించినట్లు చెప్పారు.

First published: August 4, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>