ఇలా అయితే కష్టం సార్... చంద్రబాబు వద్ద తెగేసి చెబుతున్న టీడీపీ నేతలు?

ఈ నెల 17 నుంచి 45 రోజుల పాటు జనచైతన్య యాత్రలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.

news18-telugu
Updated: February 14, 2020, 8:15 PM IST
ఇలా అయితే కష్టం సార్... చంద్రబాబు వద్ద తెగేసి చెబుతున్న టీడీపీ నేతలు?
చంద్రబాబునాయుడు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడు వద్ద తెలుగు దేశం పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నట్టు సమాచారం. ఈ నెల 17 నుంచి 45 రోజుల పాటు జనచైతన్య యాత్రలు చేయాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు జిల్లాల్లో నేతలకు సూచించారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ ఇన్‌చార్జిల నేతృత్వంలో జనచైతన్య యాత్రలు చేయాలని ఆదేశించారు. వాస్తవానికి చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా జనచైతన్య యాత్ర చేయాలని తొలుత భావించారు. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై కనీసం ఏడాది కూడా కాకముందే ఇలా ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వెళ్లడం తప్పుడు సంకేతాలను పంపుతుందనే ఉద్దేశంతో వెనక్కి తగ్గారు. అయితే, చంద్రబాబు చెప్పిన ప్రజాచైతన్య యాత్రలను 45 రోజుల పాటు చేయడం సాధ్యం కాదని తెలుగుదేశం నేతలు చెబుతున్నట్టు తెలిసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజావేదిక కూల్చివేత సమయం నుంచి తాజాగా మూడు రాజధానుల వరకు టీడీపీ అంతో ఇంతో నిరసనలు చేస్తూ ఉంది. ఇప్పుడు మళ్లీ 45 రోజుల పాటు పోరాటం చేయాలంటే సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ గ్రామాల్లోనూ టీడీపీ, వైసీపీ అనే స్పష్టమైన విభజన ఉంది. ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయి. పండుగలకు ఫ్లెక్సీలు కట్టే విషయంలో కూడా రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి. గ్రామాల్లో గొడవలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా జనచైతన్య యాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళితే మరిన్ని సమస్యలు మెడకు చుట్టుకుంటాయని టీడీపీ నేతలు సంశయిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉండేవారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై ఉన్న కేసుల విషయాన్ని ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఏదో ఒకటి, రెండు రోజుల పాటు ధర్నాలు చేయడం వరకు సాధ్యమవుతుంది కానీ, 45 రోజుల పాటు పోరాటం సాధ్యంకాదని చెబుతున్నారు.

మార్చి 15వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలో జన చైతన్య యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్లి టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కేలా చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే, అన్నిరోజుల పాటు పోరాటాలు సాధ్యం కాదని తమ్ముళ్లు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు