Home /News /politics /

NOT INTERESTED TO BUILD AN OPPOSITION NATIONAL FRONT JDS ONLY FOCUS IS KARNATAKA SAYS DEVEGOWDA SLAMS CONGRESS MKS

KCRకు షాకిచ్చిన దేవేగౌడ! -బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమి కష్టమే -2సార్లు విఫలమయ్యానన్న మాజీ ప్రధాని

దేవేగౌడతో కేసీఆర్(పాత ఫొటో)

దేవేగౌడతో కేసీఆర్(పాత ఫొటో)

జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి అంత సులవైన విషయం కాదని, ఆ దిశగా తనకు ఏమాత్రం ఆసక్తి లేదని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవేగౌడ అన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలకు శరాఘాతంలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూకుడు తర్వాత.. జాతీయ స్థాయిలో ఆ పార్టీని నిలువరించగల విపక్షాల కూటమి ఏర్పాటుపై చర్చ ముమ్మరమైంది. ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ దారుణంగా విఫలమైన దరిమిలా కాంగ్రెసేతర జాతీయ కూటమి అవసరంపై పలువురు నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి అంత సులవైన విషయం కాదని, ఆ దిశగా తనకు ఏమాత్రం ఆసక్తి లేదని మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవేగౌడ అన్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు, విపక్షాల కూటమి, కర్ణాటకలో జేడీఎస్ పరిస్థితి, కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు అంశాలపై దేవేగౌడ్ ఆసక్తిక కామెంట్లు చేశారు. ఇవి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలకు శరాఘాతంలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది..

తెలంగాణలో వరి సాగుపై వివాదం, వరుస ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాల తర్వాత కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించడం, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి నిర్మాణానికి నడుంకట్టడం, ఆ మేరకు పలు రాష్ట్రాల్లో పర్యటించి, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేయత్నం చేయడం తెలిసిందే. త్వరలోనే కేసీఆర్ బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధినేతలైన దేవేగౌడ, కుమారస్వామిలను కలుస్తారని గతంలోనే వార్తలు వచ్చినా, ఆ దిశగా అడుగులు పడలేదు. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం న్యూస్-18 సహా పలు జాతీయ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జాతీయ కూటమి ఏర్పాటుపై దేవేగౌడ్ అనూహ్య కామెంట్లు చేశారు.

దక్షిణాదిలో ఆప్ తొలి టార్గెట్ తెలంగాణే.. ఇదీ ప్రణాళిక : పంజాబ్‌లో వీఐపీలకు సామాన్యుడి షాక్


ప్రతిపక్ష ఫ్రంట్ నిర్మించడానికి ఇతర నాయకులను సంప్రదిస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘జాతీయ కూటమి ఏర్పాటుపై నాకు ఆసక్తి లేదు. మా ఫోకస్ మొత్తం కర్ణాటకపైనే. స్థానికంగా జేడీఎస్ ను బలోపేతం చేయాలనేది నా నిబద్ధత. జాతీయ స్థాయిలో ఒక వైఖరి తీసుకోవడం చాలా కష్టం. పార్లమెంటులో గణనీయమైన సీట్లు ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మా(జేడీఎస్) జాతీయ విధానమేంటో 2023 (కర్ణాటక)అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది’అని దేవేగౌడ్ చెప్పారు.

కొన్ని రోజుల కిందట, కేసీఆర్ వరుస ప్రెస్ మీట్లలో బీజేపీపై యుద్ధం ప్రకటించిన తర్వాత, ఆ పోరుకు జేడీఎస్ అండగా ఉంటుందని దేవేగౌడ వ్యాఖ్యానించినట్లుగా తెలంగాణ సీఎంవో నుంచి ప్రకటనలు రావడం తెలిసిందే. ఇప్పుడు మాత్రం దేవేగౌడ ఆ దిశగా తనకు ఆసక్తిలేదని చెప్పడం గమనార్హం.  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రదర్శనను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తలతో ముంచెత్తారు దేవేగౌడ. మోదీ తాజా గుజరాత్ పర్యటనను గుర్తుచేస్తూ, ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత సేద తీరకుండా రాబోయే(డిసెంబర్ లో జరగబోయే) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే మోదీ ఫోకస్ పెట్టారని, పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసేందుకే గాంధీనగర్ లో పర్యటించారని గౌడ వ్యాఖ్యానించారు. కాగా,

BJP: బీజేపీ విజయ రహస్యం ఏంటో తెలుసా? ఎన్నికల సిలబస్‌లో గెలుపు గ్రామర్ ఇదే..


కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుండగా, దేవేగౌడ మాత్రం కేసీఆర్ వాదనకు భిన్నంగా బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండాలన్నారు. ‘లౌకిక భావజాలం గల ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే బాగుంటుంది. ఇందులో కాంగ్రెస్‌ కూడా ఉంటే మంచిది. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అయినప్పటికీ ఈ రోజు దాని పరిస్థితి ప్రాంతీయ పార్టీలాగే మారిపోయింది’ అని పేర్కొన్నారు. గతంలో ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తాను రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యానని దేవేగౌడ గుర్తుచేశారు.

సైలెంట్ కిల్లర్ Kejriwal: ఏ ప్రాంతీయ పార్టీకీ సాధ్యంకానిది.. KCR హడావుడి, Mamata గర్జనకు భిన్నంగా..


దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి ప్రాంతీయ పార్టీ స్థాయికి చేరిందన్న దేవేగౌడ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత నెహ్రూ-గాంధీ పరివారం తప్పుకోవాలనే వాదనపై ఆసక్తికర కామెంట్లు చేశారు. గాంధీలు తప్పుకున్నంత మాత్రాన రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ తో జేడీఎస్ కు చాలా చేదు అనుభవాలున్నాయని, రాబోయే రోజుల్లో కర్ణాటకలోగానీ, జాతీయ స్థాయిలోగానీ కాంగ్రెస్ లేదా బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకోబోదని, ఒటరిగానే అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తామని దేవేగౌడ తెలిపారు. కేసీఆర్ జాతీయ కూటమి ప్రయత్నాలను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తిరస్కరిస్తుండగా, ఇప్పుడు జేడీఎస్ సైతం జాతీయ కూటమి సాధ్యం కాదని, ఒకవేళ జరిగినా కాంగ్రెస్ ఉండాలని చెప్పడాన్ని గులాబీ బాస్ ఏవిధంగా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, CM KCR, Hd devegowda, Jds

తదుపరి వార్తలు