మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. న్యూస్18 ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అజెండా జార్ఖండ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేనను నిందించారు. ఆ మూడు పార్టీలు అధికారదాహంతో ఉన్నాయన్నారు. అజిత్ పవార్ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడం లెక్క తప్పినట్టు లేదా పొరపాటుగా భావించవచ్చన్నారు. అయితే, ఎన్సీపీ తమకు వ్యతిరేకంగానే పోరాడిందని, శివసేన తమకు ద్రోహం చేసిందన్నారు మహారాష్ట్రలో పొత్తును బీజేపీ విచ్ఛిన్నం చేయలేదని షా అన్నారు. తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏకమొత్తంలో తీసుకెళ్లి అప్పజెప్పిందని ఎద్దేవా చేశారు. మరోవైపు మహాత్మాంగాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడితో పోల్చిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మీద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసోంలో అమలు చేసిన ఎన్ఆర్సీని దేశం మొత్తం అమలు చేస్తామన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ను కూడా అమల్లోకి తీసుకొస్తామని తేల్చి చెప్పారు. గాంధీ కుటుంబానికి భద్రతను తొలగించలేదని, కేవలం మార్చామని అమిత్ షా చెప్పారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత పోలీస్ బుల్లెట్లకు ఒక్క ప్రాణం కూడా పోలేదని అమిత్ షా చెప్పారు.