మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మీద రూ.70వేల కోట్ల నీటిపారుదల కుంభకోణంలో ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలను ఆ శాఖ ఖండించింది. మూసేసిన కేసులతో అజిత్ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ రెండు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేశారు. ఓ వైపు ఎన్సీపీ - శివసేన - కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలోనే సడన్‌గా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ కొందరు ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి బీజేపీకి మద్దతు పలికారు. శనివారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.
1999 - 2014 మధ్య కాంగ్రెస్ - ఎన్సీపీ అధికారంలో ఉన్న సమయంలో విదర్భ ఇరిగేషన్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అజిత్ పవార్ సుమారు రూ.70వేల కోట్ల పథకంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అజిత్ పవార్ మీద ఏసీబీ ఆరోపణలు చేసింది. ఈ భారీ కుంభకోణం వెనుక అజిత్ పవార్ ఉన్నారని ఆరోపించింది. అయితే, ఇప్పుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయిన రెండు రోజుల్లోనే ఆ కేసులో అజిత్ పవార్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ఏసీబీ ఖండించింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:November 25, 2019, 17:37 IST