ఏపీలో పెండింగ్‌లో ఉన్న పలు స్థానిక సంస్థలకు ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 16న పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్ జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్‌తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటితోపాటు 7 కార్పొరేషన్లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 8తో ముగియనుంది.
ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికలు జరగబోయే వాటిలో చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీ కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. నెల్లూరు, కుప్పంపైనే ఏపీలోని ప్రధాన పార్టీల దృష్టి నెలకొంది.
నెల్లూరు కార్పొరేషన్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉండగా.. కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తరహాలో సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరేస్తే.. ఇక చంద్రబాబును మరింత ఆత్మరక్షణలో పడేయొచ్చనే వ్యూహంతో వైసీపీ నాయకత్వం ఉంది. అందుకే కుప్పం మున్సిపాలిటీలో పార్టీ గెలుపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ వైసీపీని గెలిపించే బాధ్యతను ఏపీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు.
ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సైతం.. కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగరకుండా చర్యలు తీసుకుంటున్నారని.. ఆ దిశగా పార్టీ నేతలకు కచ్చితమైన దిశానిర్ధేశం చేశారని వార్తలు వినిపించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గట్టిగానే టార్గెట్ చేశారు. మొత్తానికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండటంతో.. ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పర్వం మరోసారి రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకోనుందని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.