ఏపీకి ప్రత్యేక సాయమే... హోదాపై స్పష్టం చేసిన కేంద్రం

ప్రతీకాత్మక చిత్రం

భవిష్యత్తుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని...ఈ క్రమంలోనే ఏపీకి కూడా హోదా ఇచ్చే ఆలోచన లేదని గతంలోనే వెల్లడించిన కేంద్రం... తాజాగా మరోసారి అదే మాట వినిపించింది.

  • Share this:
    ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఏపీకి హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా మరోసారి తేల్చి చెప్పింది. భవిష్యత్తుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని...ఈ క్రమంలోనే ఏపీకి కూడా హోదా ఇచ్చే ఆలోచన లేదని గతంలోనే వెల్లడించిన కేంద్రం... తాజాగా మరోసారి అదే మాట వినిపించింది. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించామని తెలిపింది. పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

    14వ ఆర్థికసంఘం సిఫార్సులతో హోదా అంశం మరుగునపడిందన్న ఆయన... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై దృష్టిపెట్టామని తెలిపారు. త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తామని నిత్యానందరాయ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం మరోసారి ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన అసెంబ్లీలో మరోసారి తీర్మానం కూడా చేశారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం మాత్రం దీనిపై ఏ మాత్రం సానుకూలంగా స్పందించలేదు. తొలి నుంచీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్న కేంద్రం.. ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది.
    First published: