ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల్లో బుధవారంతో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 418 నామినేషన్లు దాఖలు కాగా, 7 వేల 2 వందల మందికి అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఐతే గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 33 వార్డులకు 143 నామినేషన్లు దాఖలవగా వీటిలో ఎనిమిది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 135 నామినేషన్లు సరైనవిగా గుర్తించారు. మంగళవారం 92 మంది బుధవారం పది మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. 33వార్డులకు గానూ 33 మందే పోటీలో ఉండటంతో అధికారులు పిడుగురాళ్ల మున్సిపాలిటీని ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు.
ఇక గుంటూరు జిల్లాలోని మాచర్ల పురపాలక సంఘంలో 31 వార్డులలో 60 మంది నామినేషన్లు సమర్పించగా అందరూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావటం విశేషం. వీరిలో ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో 54 మంది పోటీలో నిలిచారు. ఐతే చివరిరోజు ఒకేసారి 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో తుడిజాబితాలో ఉన్న 31 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వీటితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు మున్సిపాలిటీ, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయచోటి మన్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. ఇవే కాకుండా తూర్పుగోదావరి జిల్లా తుని, కర్నూలు జిల్లా డోన్, నంద్యాల పట్టణాలు కూడా ఏకగ్రీవం కావడంతో అక్కడ పోలింగ్ జరగడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈనెల 10న ఎన్నికలు జరగనున్న 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మొత్తం 17, 418 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 7వేల మందికిపైగా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈనెల 10న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏకగ్రీవాల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవాలు చేసుకుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉంది.