పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NCR)పై ఇప్పటికే దేశంలో దుమారం రేగుతోంది. వీటికి వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం తాజాగా NPR (జాతీయ జనాభా పట్టిక)కు ఆమోద ముద్ర వేసింది. 2021 జనాభా లెక్కలకు గాను.. వచ్చే ఏడాది నుంచి జనగణన చేపట్టి NPRని అప్డేట్ చేస్తామని వెల్లడించింది. ఐతే NPRపై దేశ ప్రజల్లో ఎన్నో అనుమానాలు, అపోహలున్నాయి. అసోంలో NRC తరహాలోనే దేశవ్యాప్తంగా NPR నమోదు చేసి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను బయటకు పంపిస్తారని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాటన్నింటిపై క్లారిటీ ఇచ్చారు అమిత్ షా. ANI వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన NPR, NCR అంశాలపై మాట్లాడారు. జాతీయ పౌర పట్టిక, జాతీయ జనభా పట్టికకు ఎలాంటి లింక్ లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
మీరు దేశ పౌరులా? కాదా? అన్నప్రశ్నే NPRలో ఉత్పన్నం కాదని వెల్లడించారు. NPR వల్ల ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని.. కేవలం దేశంలో ఎంత జనాభా ఉందనే వివరాలను మాత్రమే సేకరిస్తామని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. అసోంలో తరహాలోనే దేశ వ్యాప్తంగా NRC నిర్వహించబోతున్నారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. దీనిపై ఇప్పుడు చర్చ అవసరం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా పాన్ ఇండియా NRCపై కేంద్ర కేబినెట్లో గానీ, పార్లమెంట్లో గానీ అసలు చర్చే జరగలేదని చెప్పకొచ్చారు. అలాంటప్పుడు దీనిపై ఆందోళన అవసరం లేదని దేశ ప్రజలకు సూచించారు.
ఇక కేరళ, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలు NPRని తిరస్కరించడాన్ని హోంమంత్రి అమిత్ షా తప్పుబట్టారు. తమ నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాల్సిందిగా ఇద్దరు ముఖ్యమంత్రులను కోరుతున్నట్లు తెలిపారు. రాజకీయాల కోసం పేదల ప్రజలను అభివృద్థి పథకాలకు దూరం చేయవద్దని సూచించారు అమిత్ షా.
ఇది కూడా చూడండి :
Published by:Shiva Kumar Addula
First published:December 24, 2019, 19:29 IST