ఏపీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందింది. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనానికి నారాచంద్రబాబు నాయుడి నాయకత్వంలో టీడీపీ కేవలం 27 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పరిస్థితి అయితే మరీ అధ్వానం. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ కూడా ఓ నియోజకవర్గంలో విజయం సాధించలేకపోయాడు. జనసేన పరిస్థితి ఎలా ఉన్నా, 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన నారా చంద్రబాబునాయుడిపై ఏపీ ప్రజల్లో ఇంత నెగిటివిటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించలేకపోయారు. ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబా నాయుడు కూడా గతంలో కంటే చాలా తక్కువ మెజారిటీతో విజయం సాధించాడంటే టీడీపీ పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ముందు నుంచే రాష్ట్రంలో ‘ఫ్యాను’ గాలి వీస్తుందనే ఊహాగానాలు మిన్నంటాయి. వాటికి తగ్గట్టుగానే ఫ్యాను గాలికి ‘గ్లాసు’ కిందపడి పగిలిపోగా... ‘సైకిల్’ పంచర్ అయ్యింది. ఏపీ ఎన్నికల ఫలితాలపై సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి, రెండోసారి ప్రధాని పదవి చేపట్టబోతున్న నరేంద్ర మోదీకి శుభాకంక్షలు తెలిపిన బ్రహ్మజీ... ఏపీలో ఘనవిజయం సాధించిన వైసీసీ నేత జగన్‌కు అభినందనలు తెలిపారు. ఈ రెండు ట్వీట్స్ వరకూ చాలామంది నటులు, దర్శకుడు, సెలబ్రిటీలు పెట్టిన చాలా కామన్ ట్వీట్సే. అయితే ఆ తర్వాతే తన మనసులో మాట బయటపెట్టాడు బ్రహ్మాజీ.
తారక రాముడే ఆదుకోవాలి... అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్
‘ఇక మా తారక రాముడే ఆదుకోవాలి’ అంటూ ట్వీట్ చేశాడు బ్రహ్మాజీ. బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బీభత్సమైన స్పందన వస్తోంది. తారక్ రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలి... అంటూ ఎన్టీఆర్ గతంలో జరిపిన ఎన్నికల ప్రచార చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు జూనియర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ స్నేహితుడిగా బ్రహ్మాజీ బాహాటంగా తన మనసులో మాట బయటపెట్టినా, చాలామంది టీడీపీ అభిమానుల్లో ఇదే ఆలోచన ఉంది. నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ ‘పప్పు’గా ముద్రపడడం... అవన్నీ పట్టించుకోకుండా లోకేష్‌ను రాజకీయాల్లో తన వారసుడిగా చేయాలని చంద్రబాబు ప్రయత్నాలు టీడీపీ ప్రస్తుత పరిస్థితి కారణమని నమ్మేవాళ్లు లేకపోలేదు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మునుపటి వైభవం రావాలంటే తారక్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందేనని నమ్ముతున్నారు రాజకీయ విశ్లేషకులు. 2009 ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని తనలో తాత పోలికలే కాదు, ఆయనలోని రాజకీయ వాగ్దాటి కూడా వచ్చిందని నిరూపించుకున్న తారక్... ప్రత్యేక్ష రాజకీయాల్లో దిగుతాడో లేదో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.
Published by:Ramu Chinthakindhi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.