టీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తరువాత పార్టీ శ్రేణులకు వెంటనే గుర్తొచ్చే పేరు కవిత. కేసీఆర్ కుమార్తెగా, నిజామాబాద్ మాజీ ఎంపీగా టీఆర్ఎస్లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించిన కవిత... లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత పూర్తిగా రాజకీయాల నుంచి సైలెంట్ అయిపోయారు. అయితే రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ కవితకు దక్కుతుందని... మళ్లీ ఆమె టీఆర్ఎస్లో ముఖ్య భూమిక పోషిస్తారని చాలామంది భావించారు. టీఆర్ఎస్లో కొన్ని నెలల నుంచి ఈ చర్చ జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం కవితకు రాజ్యసభ సీటు ఇవ్వలేదు. దీంతో రాజకీయాల్లో కవిత భవిష్యత్తు ఏంటనే దానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రస్తుతానికి కవిత రాజ్యసభకు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో... ఆమెను ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఇప్పటికే కేసీఆర్ మంత్రివర్గంలో కేటీఆర్, హరీశ్ రావు ఉండటంతో.... కవితకు ఆ అవకాశం ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు కవితను మళ్లీ పార్టీలో యాక్టివ్ చేయాలనే ఆలోచన కేసీఆర్‌కు ఉంటే... ఇప్పటికే పార్టీ నేతల నుంచి ఆ దిశగా సంకేతాలు వచ్చేవని కొందరు చెబుతున్నారు. అయితే ఇటు పార్టీ నేతల నుంచి కానీ, అటు కవిత నుంచి కానీ... ఇందుకు సంబంధించి ఎలాంటి సంకేతాలు రావడం లేదు.
కేసీఆర్, కవిత (ఫైల్ ఫోటో)
దీంతో ఇప్పుడప్పుడే కవితకు కేసీఆర్ కీలకమైన పదవి ఇచ్చే యోచనలో లేరనే టాక్ వినిపిస్తోంది. అయితే మరో నాలుగేళ్ల పాటు కవిత ఇదే రకంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందేనా ? అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే కూతురు రాజకీయ భవిష్యత్తు విషయంలో కేసీఆర్ ఏదో ఒక ఆలోచన చేసి ఉంటారని... సమయం వచ్చినప్పుడు దాన్ని అమలు చేస్తారని పలువురు నేతలు భావిస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ తరపున కవితను రాజ్యసభకు పంపకపోవడంతో... ఆమె భవిష్యత్తు ఏమిటన్న అంశం టీఆర్ఎస్తో పాటు తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.