Nimmagadda vs YS Jagan: నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. నెక్ట్స్ టర్న్ ఏంటి?

తాను పదవిలో ఉండగానే ఎన్నికలు జరిపించాలనే మొండితనంతో నిమ్మగడ్డ వ్యవహరిస్తుంటే...ఎట్టి పరిస్థితులలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ కుర్చీలో ఉన్నంతకాలం ఎన్నికలు జరపకూడదని జగన్ భావిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

news18-telugu
Updated: November 19, 2020, 10:02 PM IST
Nimmagadda vs YS Jagan: నిమ్మగడ్డ వర్సెస్ జగన్.. నెక్ట్స్ టర్న్ ఏంటి?
నిమ్మగడ్డ రమేశ్, వైఎస్ జగన్
  • Share this:
(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)

ఒకరు రాజ్యాంగబద్ధమైన ఉన్నతమైన పదవి ఎస్ఈసీ గా కొనసాగుతుండగా, మరొకరు శాసన ప్రక్రియ ద్వారా ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. వీరి ఇద్దరి మధ్య వైరం చిలికి చిలికి రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభేదాలకు దారితీసే ప్రమాదం ఎంతైనా ఉందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే పెద్ద హాట్ టాపిక్. వీరిద్దరి మధ్య ఇంతటి వైరానికి దారితీసిన పరిస్థితులు పాఠకులకు విదితమే. రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవ్వడం, సహజంగానే అధికారపార్టీకి ఉండే కొన్ని ప్రత్యేక వెసులుబాటుల మూలంగా వారు అత్యధికస్థానాలల్లో ఏకగ్రీవంగా గెలుచుకోవడం, ఆ వెనువెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోవిడ్-19 విజృంభణ నేపధ్యంలో ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేయటం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు ఏకపక్షంగా వాయిదా వేశారంటూ అధికారపార్టీ నాయకులు కులం పేరుతో విమర్శలు చేయడం చకచకా జరిగిపోయాయి.

ఈ పరిణామాల నేపధ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు మనిషి కావడం వల్లనే టీడీపీకి లబ్దిచేకూర్చే ఉద్ధేశ్యంతోనే ఎన్నికలను వాయిదా వేశారంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా నిమ్మగడ్డ పై విరుచుకు పడ్డారు. దీనికి కొనసాగింపుగా నిమ్మగడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఫ్యాక్షనిస్ట్ అంటూ సంభోదిస్తూ ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం టీడీపీ వారు తయారు చేసి ఇస్తే నిమ్మగడ్డ సంతకం చేసి పంపారని కూడా అప్పట్లొ ఆ లేఖపై పెద్ద దుమారమే రేగింది. పార్క్ హయత్ హోటల్లో నిమ్మగడ్డ, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావుల రహస్య కలయిక వైసీపీ చేసిన ఆరోపణలకు మరింత ఊతాన్నిచ్చిందనే చెప్పాలి.

ఇక లాభంలేదనుకున్న జగన్ ఏకంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ పదవి నుండి నిమ్మగడ్డను తొలగించి తమిళనాడుకు చెందిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. తానేమి తక్కువ తినలేదంటూ నిమ్మగడ్డ సుప్రీంకోర్టుకు వెళ్ళి తన పదవిని తాను వెనక్కి తెచ్చుకున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటే తప్ప కోరలు లేని పాములాంటి ఎస్ఈసీ పదవిలో ఎవరుంటే ఏమిలే, ఎలాగు మార్చి 2021 నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాగూ రిటైర్ అవుతారు కదా ఆ తరువాత స్థానికసంస్థల సంగతి చూడొచ్చు అని ముఖ్యమంత్రి ఆలోచనగా ఉందని చెప్పాలి.

ఐతే రాష్ట్ర ప్రభుత్వానికే వ్యతిరేకంగా కోర్టులో పోరాడి గెలిచి తెచ్చుకున్న పదవి ఊరికే ఉంటారా? తన రిటైర్మెంట్ అయ్యే లోపు ఎన్నికలు జరిపి తీరాలనే పట్టుదలతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఐతే సాక్ష్యాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఎదురు తిరిగిన అధికారికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

తాను పదవిలో ఉండగానే ఎన్నికలు జరిపించాలనే మొండితనంతో నిమ్మగడ్డ వ్యవహరిస్తుంటే...ఎట్టి పరిస్థితులలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ కుర్చీలో ఉన్నంతకాలం ఎన్నికలు జరపకూడదనే జగమొండితనంతో జగన్ పావులు కదుపుతున్నారని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అటువంటి జగన్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల మధ్య వైరం ఏక్షణంలో ఎప్పుడు ఎలా ఏం మలుపు తిరుగుతుందో అంటూ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 19, 2020, 10:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading