NIMMAGADDA RAMESH KUMAR DID NOT GET VOTER ID CARD SEC SAYS WILL GO TO COURT IN NEEDED BA
Nimmagadda: నిమ్మగడ్డకే ఏపీలో ఓటు లేదు.. మరో పోరాటానికి సిద్ధమవుతున్న ఎస్ఈసీ
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) కు ఓ విచిత్ర పరిస్థితి ఎదురైంది. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అయిన ఆయనకే ఏపీలో ఓటు హక్కు లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) కు ఓ విచిత్ర పరిస్థితి ఎదురైంది. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అయిన ఆయనకే ఏపీలో ఓటు హక్కు లేకుండా పోయింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ విషయాన్ని వెల్లడించారు. తనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉండేదని, దాన్ని సరెండర్ చేసి తాను పుట్టి పెరిగిన చదువుకున్న ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. అయితే, తనకు ఓటు హక్కు రాలేదన్నారు. తాను దుగ్గిరాలలోనే ఉంటున్నా కూడా తాను అక్కడ ఉండడం లేదనే కారణంతో తనకు ఓటు హక్కు ఇవ్వలేదని చెప్పారు. తాను దుగ్గిరాల స్కూల్లోనే చదువుకున్నానని, అక్కడే ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పారు. ఓటరు కార్డు అంశంపై ఓ సారి తమ వద్ద హాజరుకావాలని స్థానిక తహసీల్దార్ కోరారని, అయితే, అదే సమయంలో చీఫ్ సెక్రటరీతో సమావేశం కారణంగా హాజరుకాలేకపోయానన్నారు. మరో రోజు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై తాను కలెక్టర్‌ను కలసి విజ్ఞప్తి చేస్తానన్న ఎస్ఈసీ.. అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తానన్నారు. తనకు ఓటు హక్కు కల్పిస్తే తాను కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేవాడినని నిమ్మగడ్డ చెప్పారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరపకుండా ఏకగ్రీవాలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మీద నిమ్మగడ్డ విమర్శలు గుప్పించారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఎన్నికలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రభావితం చేసేలా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. ఏదైనా ప్రకటన ఇచ్చేముందు కమిషన్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై ప్రజాసంబంధాల శాఖ కమిషనర్‌ను సంజాయిషి అడిగామన్నారు. ఇలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని చెప్పామన్నారు.
ఇక ఏపీలో గతంలో ఏకగ్రీవం అయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీద కూడా తాము దృష్టి పెట్టామని నిమ్మగడ్డ అన్నారు. గతంలో కూడా ఏకగ్రీవాలు అయ్యేవని, అయితే అవి పరిమిత సంఖ్యలోనే ఉండేవన్నారు. ఈ సారి ఏకగ్రీవాల విషయంలో రాజకీయ పార్టీలు పలు అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో వాటిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో వాటిపై దృష్టి పెట్టామన్నారు. ఎన్నికల్లో పోటీచేయాలనుకునే వారికి నైతికంగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.