నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఏపీ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గతంలో ఇదే వాదనతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను, ఎన్నికల సంఘం పిటిషన్‌తో జత చేసింది సుప్రీంకోర్టు.
రమేష్ కుమార్‌ను తొలగించేందుకు జగన్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్‌గా రమేష్ కుమార్ ఎస్ఈసీ అవుతారు కదా? ఇందులో గందరగోళం ఏముంది? అని చాలా మంది ప్రశ్న. రాజకీయ పరిణామాలను పరిశీలించే అందరికీ ఉన్న డౌట్. అదే సమయంలో హైకోర్టు తీర్పు తర్వాత తాను ఎస్ఈసీగా పునర్నియామకం అయినట్టేనంటూ రమేష్ కుమార్ ఎన్నికల సంఘం కార్యదర్శికి తెలియజేయడంతో అక్కడి నుంచి ఓ సర్క్యులర్ జారీ అయింది. అయితే, ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ హైకోర్టు
అసలు ఈ వివాదం అంతా హైకోర్టు తీర్పు తర్వాత మొదలైంది. కోర్టు తీర్పును ఎవరికి వారు అనుకూలంగా మార్చి చెప్పుకుంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసు తీర్పును హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఇచ్చారు. అందులో మొత్తం 319 పేరాలు ఉన్నాయి. అందులోని 317 పేరాలో హైకోర్టు ఏం చెప్పిందంటే.. ‘ఏప్రిల్ 10వ తేదీన ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ నెంబర్ 5, దానికి అనుబంధంగా జీవోలు 617 (రమేష్ కుమార్ పదవీకాలం ఆటోమేటిక్‌గా ముగిసిపోయినట్టు పేర్కొనే జీవో) , 618, 619 (రెండూ జస్టిస్ (రిటైర్డ్) కనగరాజ్ ను ఎస్ఈసీగా నియమిస్తూ తెచ్చిన జీవోలు) పక్కన పెట్టడమైనది.’ అని చెప్పింది.
హైకోర్టు తీర్పులోని పేరా 318
ఇక పేరా 318లో ఏం చెప్పిందంటే... ‘నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. 2016 జనవరి 30న ఇచ్చిన జీవోలో పేర్కొన్నట్టు ఆయన పదవీకాలం పూర్తయ్యేవరకు ఎస్ఈసీగా కొనసాగుతారు. దానికి సంబంధించిన ప్రయోజనాలను కూడా ఆయన పొందుతారు.’ అని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇక్కడే ఏపీ ప్రభుత్వం లాజిక్ పట్టుకుంది. ఎస్ఈసీని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పిన హైకోర్టు.. మళ్లీ రమేష్ కుమార్‌ను ఎస్ఈసీగా నియమించాల్సిందిగా రాష్ట్రాన్ని ఆదేశించడం అంటే రాష్ట్ర ప్రభుత్వం మరో సారి చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఏజీ సుబ్రమణ్యం శ్రీరామ్ చెబుతున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.