ఉత్తరప్రదేశ్... కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించే అత్యంత ప్రాధాన్యం గల రాజకీయ రాష్ట్రం. అందుకే ఆ రాష్ట్రాన్ని కేంద్రంలో అధికారానికి దగ్గరిదారిగా భావిస్తారు రాజకీయ పండితులు. మొత్తం 80 స్థానాలు గల యూపీలో ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. ఆరు దశల్లో 67 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగితే బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను సాధించనున్నట్టు News18-IPSOS ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఆరు విడతల్లో 67 స్థానాలకు గాను ఎన్‌డీఏకు 50-54, బీఎస్పీ-ఎస్పీ నేతృత్వంలోని మహాకూటమికి 12-16, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు కేవలం 1-2 సీట్లు వస్తాయని News18-IPSOS ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. చివరి విడతలో 13 స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. వీటిని కలుపుకుంటే యూపీలో ఎన్‌డీఏ బలం మరింత పెరిగే అవకాశముంది. యూపీ ప్రజలు తమ వైపు నిలిచారన్న కమలనాథుల అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి.
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 71, సమాజ్‌వాదీ పార్టీకి 5, కాంగ్రెస్‌కు 2, అప్నాదళ్‌కు 2 స్థానాలు వచ్చాయి. ఎన్డీఏ మొత్తం 73 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. అయితే 2014 ఎన్నికలతో పోలిస్తే యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి ఎన్డీఏకు సీట్లు కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది. సీట్లు తగ్గినా మొత్తంగా చూస్తే పైచేయి మాత్రం బీజేపీదే. యూపీలో మూడింట రెండొంతుల స్థానాల్లో కాషాయ జెండా ఎగిరే అవకాశముందని News18-IPSOS ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీ, రాయ్ బరేలీ నుంచి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, అమేథీలో రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆజాంగఢ్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, మెయిన్‌పురి నుంచి ములాయం సింగ్ యాదవ్ లాంటి ప్రముఖులు పోటీ చేశారు.
ఉత్తరప్రదేశ్: మొత్తం 80 సీట్లు... ఆరు దశల్లో 67 స్థానాల్లో పోలింగ్
ఎన్డీఏ: 50-54
బీజేపీ: 50-54
అప్నాదళ్ (ఎస్): 0
మహాకూటమి: 12-16
ఎస్పీ: 6-8
బీఎస్పీ: 5-7
ఆర్‌ఎల్‌డీ: 0-1
యూపీఏ: 1-2
కాంగ్రెస్: 1-2
జేఏపీ: 0
ఇతరులు:0
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.