కాళ్ల పారాణి ఆరకముందే ఓ ఆడపడుచు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన మూడు రోజులకే ప్రాణం తీసుకుంది. ఏ కష్టమొచ్చిందో కానీ... కిరోసిన్ పోసుకొని మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో చోటు చేసుకుంది.
ఊలపాడు పంచాయతీ గంపనపల్లెకు చెందిన 19 ఏళ్ల సరస్వతిని... గంపనపల్లెకు చెందిన సొంత మేనమామ జగదీశ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈనెల 13న వీరి వివాహం జరిగింది. అయితే 14వ తేదీ సరస్వతీ భర్తతో కలిసి అత్తగారిల్లైన గంపనపల్లెకు వెళ్లింది. భార్యభర్త కలిసి పుంగనూరులో సరదాగా సినిమాకు కూడా వెళ్లొచ్చారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు. శుక్రవారం రాత్రి సరస్వతీ బాత్రూంలోకి వెళ్లి తలుపేసుకొంది.
ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అయితే బాత్రూం నుంచి పొగలు రావడంతో గమనించిన కుటుంబసభ్యులు తలుపులు పగులకొట్టారు. లోపల సరస్వతీ శరీరం అప్పటికే మంటల్లో పూర్తిగా కలిపోయింది. దాదాపు 80 శాతం శరీరం కాలి ముద్దయ్యింది. దీంతో వెంటనే ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సరస్వతీ చనిపోయింది.
సరస్వతీ మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆమె ఆత్మహత్యకు మాత్రం కారణాలు ఇంకా తెలియలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరుకుటుంబాలను విచారిస్తున్నాయి. కుటుంబ కలహాలా... లేక భర్తతో ఏమైనా గొడవలు జరిగాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.