తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ఆ పార్టీ తరపున ఎన్నికైన మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా... తాజాగా మరో ఇద్దరు నేతలు కూడా కారెక్కేందుకు సిద్ధమవుతున్నారనే న్యూస్ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య.. ఆయనతో పాటు వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మరి కొందరు నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న పొదెం వీరయ్య పార్టీని వీడుతున్నట్లుగా ప్రచారం జరగడం పార్టీలో కలకలం రేపింది. ఇక వరంగల్ డీసీసీ పరిధిలోని పార్టీ వ్యవహారాల్లో జనగామ డీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకుంటున్నారంటూ వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తన నివాసంలో నాయిని రాజేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మరో సీనియర్ నేత రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ అంశంపైన పార్టీ కోర్ కమిటీలో మాట్లాడదామని ఆయనకు సూచించారు. పొదెం వీరయ్యకు ఫోన్ చేసిన వీహెచ్... ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఆయనను కోరినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరిగేలా ప్రయత్నిస్తాననీ వీహెచ్ వారికి హామీ ఇచ్చారని... ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తోనూ మాట్లాడారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మిగిలిన కొద్దిమంది నేతలు పార్టీ వీడకుండా చూసేందుకు ఆ పార్టీ నాయకులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:June 19, 2020, 07:11 IST