M.BalaKrishna, Hyderabad, News18
ఎన్నికల సమయంలో పార్టీని అంటిపెట్టుకున్న వారే.., ఎన్నికల అనంతరం దూరం అవుతూవస్తున్నారు. అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన నేతలే ఘోర పరాభవంతో గోడపై పిల్లిలా పార్టీలు మారిపోయారు. 2019 ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) పరిస్థితి చాల దారుణంగా మారింది. ఓటమి పాలు కావడంతోనే కొందరు నేతలు వైఎస్ఆర్సీపీలో (YSR Congress) చేరగా.. మరికొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (Bharatiya Janatha Party) కండువా కప్పేసుకున్నారు. పార్టీనే నమ్ముకున్న వారు మాత్రం కొంత వెనక్కు తగ్గి సైలెంట్ అయ్యారు. పార్టీలో కొందరు నేతలు నోరెత్తిన కేసులకు బయపడి వెనకడుగు వేయక తప్పలేదు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయాయి. కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐతే పార్టీలో సీనియర్ నేతల వ్యవహారం మాత్రం అధినేతకు తలనొప్పిగా మారింది.
పార్టీని గాడిన పెడదాం అనే సమయంలోనే సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchhaiah Chowdary) వ్యవహారం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఆ ఘటన టీ కప్పులో తుఫానుగా మారడంతో అక్కడితో సమస్య తొలగిపోయిందిని అనుకున్నారు. ఇప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఘాటైన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. దీంతో ఏపీ టీడీపీలో తిరుగుబాటు ప్రారంభం అయిందా..?? సీనియర్ల ఆగ్రహానికి కారణం ఏంటి..?? అనే చర్చ పార్టీ క్యాడర్ లో సాగుతోంది.
ఇటీవల అనంతపురం టీడీపీ పెద్దలు వేదికగా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు టీడీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జులు పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు కార్యక్రమ అజెండాను వెనక్కు నెట్టేశాయి. టీడీపీ నాయకులను చేతకాని దద్దమ్మలుగా పోల్చడంతో పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై నేరుగానే ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. జేసీ చేసిన వ్యాఖ్యలపై నేతలు ఆ సమావేశంలో నోరు మెదపలేదు. అందరూ కామ్ గా విని వెళ్లిపోయారు.
ఐతే ఆ తర్వాతి రోజు ఎంమైందో ఏమో తెలియదు కానీ జేసి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం మొదలెట్టారు. జేసీపై పార్టీ నాయకులంతా ఒంటి కాళ్లపై లేచి ధ్వజమెత్తారు. అనంత టీడీపీలో ఎప్పుడు విబేధాలు లేవన్న నాయకుల జేసీ కుటుంబం టీడీపీలోకి వచ్చాకే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. సీమలో రచ్చ ముదురుతుండటంతో పార్టీ పెద్దలు ఇటువైపు ఓ కన్నేసి ఉంచారు. అసలు కార్యక్రమంలో ఎం జరిగిందో తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేశారు. ఇంత వరకు అంత బాగానే ఉన్నా.. జేసీ ఎందుకలా మాట్లాడారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అనంతపురం జిల్లా టీడీపీలో కొందరు నేతలతో జేసీ సోదరులకు పడటం లేదనేది బహిరంగ రహస్యం. గతంలోనూ దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. గత ఎన్నికల్లో అనంతలో బాలకృష్ణ, పయ్యావుల తప్ప అంతా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో తాడిపత్రిలో మాత్రమే జేసీ సోదరులు పట్టు సాధించగలిగారు. తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నామని అనుకున్నారో లేక జిల్లాలోని పార్టీ నేతల నుంచి సరైన సహకారం లేదని గుర్రుగా ఉన్నారో తాజాగా జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన కామెంట్స్ నేతల మధ్య ఉన్న లుకలుకల్ని బయటపెట్టాయి.
పార్టీ సీనియర్ నాయకుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారం కూడా తీవ్ర కలకలం రేపింది. పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన తర్వాత అంత సర్దుకున్నట్లు కనిపించినా.. .ఆయన చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం పార్టీలో నిప్పు రాజేస్తోంది. గోదావరి జిల్లాల్లో గోరంట్ల, అనంతలో జేసీ. ఇద్దరూ పార్టీలో సీనియర్ నాయకులే. ఒకప్పుడు టీడీపీలో ఎంతటి సీనియర్లు అయినా అసంతృప్తిని పెదవి దాటనిచ్చేవారు కాదు. ఇటీవల కాలంలో ఏమైందో ఏమోగానీ తమ అసమ్మతిని పార్టీ అధిష్టానానికి గట్టిగ వినిపిస్తున్నారు. అదే ఇప్పుడు పార్టీకి ధిక్కార స్వరంగా మారిపోతోంది. బయటకు చెప్పుకున్న పార్టీ వర్గాల్లో వీటిపై లోతుగా చర్చ సాగుతోంది. ఈ ప్రభావంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Jc prabhakar reddy, TDP