డామిట్... కథ అడ్డం తిరిగింది... మహారాష్ట్రలో ఈయన భవిష్యత్తు ఏంటి ?

సొంత పార్టీకి హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించి వెనక్కి తగ్గడంతో...అజిత్ పవార్‌కు కొత్తగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి లేదా కీలకమైన మంత్రి పదవి దక్కుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.

news18-telugu
Updated: November 26, 2019, 4:36 PM IST
డామిట్... కథ అడ్డం తిరిగింది... మహారాష్ట్రలో ఈయన భవిష్యత్తు ఏంటి ?
అజిత్ పవార్
  • Share this:
మహారాష్ట్ర రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన ఎన్సీపీ ముఖ్యనేత అజిత్ పవార్... మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎన్సీపీ అధినేత, చిన్నాన్న శరద్ పవార్ మంతనాలు, కుటుంబ ఒత్తిడి మేరకు మళ్లీ సొంత గూటికి తిరిగొచ్చిన అజిత్ పవార్... మహారాష్ట్రలో బీజేపీ వెనక్కి తగ్గడంలో కీలక పాత్ర పోషించారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్ది గంట్లోనే ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయ్యింది.

ఇంతవరకు బాగానే ఉన్నా... కొత్తగా ఏర్పడబోయే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్‌కు ప్రాధాన్యత ఉంటుందా ? ఉంటే ఆయనకు ఎలాంటి పదవి లభిస్తుంది ? అనే అంశంపై మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది. శివసేన సీఎం పదవి తీసుకోవడం దాదాపు ఖాయం కావడంతో... ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం లాంఛనమే. ఒకవేళ అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపకపోతే... ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన కచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి వరించేది.

అయితే తాజాగా ఆయన సొంత పార్టీకి హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించి వెనక్కి తగ్గడంతో...అజిత్ పవార్‌కు కొత్తగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి లేదా కీలకమైన మంత్రి పదవి దక్కుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే పవార్ కుటుంబం ఒత్తిడి మేరకు మళ్లీ సొంతగూటికి తిరిగొచ్చిన అజిత్ పవార్... బీజేపీ బలపరీక్షకు ముందే వెనక్కి తగ్గడంలో కీలక పాత్ర పోషించారని... కాబట్టి ఆయనకు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే అజిత్ పవార్‌కు మరోసారి అంతటి కీలకమైన పదవి ఇచ్చేందుకు శరద్ పవార్ అంగీకరిస్తారా ? ఒకవేళ శరద్ పవార్ ఒప్పుకున్నా... ఇందుకు శివసేన, కాంగ్రెస్ ఒప్పుకుంటాయా అన్నది కూడా ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాల్లో న్యూస్ మేకర్‌గా మారిన అజిత్ పవార్ పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి.


First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>