news18-telugu
Updated: May 19, 2019, 6:16 PM IST
అమరీందర్ సింగ్(File)
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తప్పించి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సీఎం కావాలని అనుకుంటున్నాడేమో? అంటూ వ్యాఖ్యానించారు. తనకు, సిద్ధూకు మధ్య మాటల యుద్ధం జరుగుతోందంటూ వస్తున్న ఊహాగానాలపై అమరీందర్ స్పందించారు. 'మా మాధ్య అలాంటిదేమీ లేదు. ఆశలనేవి అందరికీ ఉంటాయి. ఆయనకు అలాంటి ఆశలే ఉంటే.. మంచిదే. చిన్నప్పటి నుంచి సిద్ధూ నాకు తెలుసు. ఆయనతో నాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. ఆయన నన్ను తప్పించి సీఎం కావాలని కోరుకుంటున్నారేమో? అది ఆయనకు సంబంధించిన వ్యవహారం' అని కెప్టెన్ అమరీందర్ అన్నారు. కాగా, తనకు అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ రాకుండా కెప్టెన్ అమరీందర్ సింగ్ అడ్డుకున్నారంటూ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ ఇటీవల ఆరోపణలు చేయడం, తన భార్య నైతిక విలువలున్న ధైర్యవంతురాలని, అబద్ధాలు ఆడరని సిద్ధూ ఆమెను సమర్ధించిన నేపథ్యంలో కెప్టెన్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా, సిద్ధూ గతంలో తనకు అసలైన కెప్టెన్ రాహులేనని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ ఫిరంగి అయితే, తాను ఏకే-47 అని వ్యాఖ్యానించారు. తాజాగా తనను తప్పించి సిద్ధూ సీఎం అవుదామని అనుకుంటున్నారేమో అని అమరీందర్ వ్యాఖ్యానించడంతో పంజాబ్ రాజకీయంలో మరింత వేడి పుట్టింది.
First published:
May 19, 2019, 6:16 PM IST