Home /News /politics /

NAVJOT SINGH SIDHU APPOINTED PUNJAB CONGRESS CHIEF AMID ESCALATING TENSION MK GH

Congress: కాంగ్రెస్‌ పార్టీలో ‘గాంధీ’ మార్క్ ఆధిపత్యం.. పంజాబ్‌లో పార్టీ నాయకత్వ మార్పు.. రాజస్థాన్, కర్ణాటక పరిస్థిత?

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ పార్టీలో తమ నిర్ణయమే ఫైనల్​ అని గాంధీ కుటుంబం మరోసారి స్పష్టంగా చాటిచెప్పింది. పార్టీకి తిరుగులేని బాస్​ మేమే అని తేల్చేసింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్​ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నవజ్యోత్ సింద్ సిద్ధును ఎంపిక చేసి ఆయనను వ్యతిరేకించిన సీనియర్లకు షాకిచ్చింది.

ఇంకా చదవండి ...
కాంగ్రెస్ పార్టీలో తమ నిర్ణయమే ఫైనల్​ అని గాంధీ కుటుంబం మరోసారి స్పష్టంగా చాటిచెప్పింది. పార్టీకి తిరుగులేని బాస్​ మేమే అని తేల్చేసింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్​ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నవజ్యోత్ సింద్ సిద్ధును ఎంపిక చేసి ఆయనను వ్యతిరేకించిన సీనియర్లకు షాకిచ్చింది. సిద్దును పీసీసీ అధ్యక్షుడిగా చేయకూడదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వర్గం బలంగా గళం వినిపించినా.. తమ నిర్ణయమే శాసనమని గాంధీలు చెప్పేశారు. మాజీ క్రికెటర్​ సిద్ధుకే పీఠం కట్టబెట్టారు.

పంజాబ్ పీసీసీ చీఫ్ నియమకాన్ని కొంత కాలం వాయిదా వేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. అయితే సీనియర్​ నేత ​ ప్రతాప్ సింగ్ బాజ్వా.. అధిష్ఠానానికి తన మద్దతు చూపించుకునేందుకు రాష్ట్రానికి చెందిన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆగ్రహించిన సోనియా గాంధీ తక్షణమే పీసీసీ అధ్యక్షుడిగా సిద్ధు పేరును ప్రకటించారు.

మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి తనకే దక్కాలని, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గనని కూడా సిద్ధు అధిష్ఠానానికి చెప్పారు. అలాగే రాష్ట్ర ఇన్​చార్జ్​ హరీశ్ రావత్​తోనూ ఈ విషయాన్ని చాలా కఠినంగా చెప్పారని సమాచారం. అలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ జాగ్రత్తగా ఎంపిక చేసింది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా.. అలాగే రాహుల్ గాంధీకి దగ్గరగా ఉండే వారినే ఎంచుకుంది.

పంజాబ్​లో సీనియర్లకు చెక్ పెట్టడంతో యువ తరానికే కాంగ్రెస్​ ప్రాధాన్యత ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ విషయంలోకి రాగానే ముందుగా గుర్తొచ్చేది రాజస్థాన్​. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ఎంతో పాపులారిటీ ఉన్న యువ నేత, పీసీసీ బాస్​ సచిన్ పైలట్​ను కాదని సీనియర్ అశోక్ గెహ్లాట్​ను అధిష్ఠానం సీఎంను చేసింది. గెహ్లాట్​కు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో అధికారం చేజారుతుందోమోనని హస్తం పెద్దలు గెహ్లాట్​కే పట్టం కట్టారు. అయితే తాజాగా పంజాబ్ పరిణామాలతో రాజస్థాన్​లో సచిన్ పైలట్ మద్దతుదారుల్లో ఆశలు పెరిగాయి. అమరీందర్​కు భయపడని గాంధీ కుటుంబం గెహ్లాట్​కు ఎందుకు జంకుతోందని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

అందులోనూ భవిష్యత్తులో సీఎం అవకాశమొస్తుందని సచిన్ పైలట్​కు కాంగ్రెస్ అధిష్ఠానం అభయమిచ్చిందని పార్టీ వర్గాల టాక్​. దీంతో పైలట్​ మద్దతుదారుల్లో ఆశలు రేగుతున్నాయి. దీంతోపాటు రాహుల్​ గాంధీకి సచిన్ మంచి సన్నిహితుడే. అందులోనూ ఇక కాంగ్రెస్​లో యువ తరానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఎప్పటి నుంచో అభిప్రాయపడుతున్నారు. దేశంలో హస్తం పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఇదే మార్గమని భావిస్తున్నారు. దీంతో ఆపరేషన్ పంజాబ్ తర్వాత రాజస్థాన్ వైపే కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నారని అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా పరిణామాలు ఎలా ఉన్నా ఒక్కోసారి తమ నిర్ణయమే ఫైనల్​ అని తీర్మానించే గాంధీ కుటుంబం రాజస్థాన్​పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరోవైపు కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి ఉంది. సీనియర్ అయిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంచి పాపులారిటీ ఉన్న డీకే శివకుమార్ మధ్య యుద్ధం నడుస్తోంది. ఎన్నికలు కూడా రాబోతున్న తరుణంలో కర్ణాటక విషయంలో హస్తం అధిష్ఠానం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ మద్దతు నిండుగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు శివకుమారే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట.

ఇది కూడా చూడండి...
Published by:Krishna Adithya
First published:

Tags: Rahul Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు