Shravan Kumar BommakantiShravan Kumar Bommakanti
|
news18-telugu
Updated: July 22, 2019, 11:52 AM IST
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (File)
సార్వత్రిక ఎన్నికల ప్రభావం కాంగ్రెస్ పార్టీపై భారీగా పడింది. కాంగ్రెస్ను తన భుజాలపై మోయాల్సిన రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటికే ఊహించని ఓటమితో కుదేలైన హస్తం పార్టీని రాహుల్ నిర్ణయం మరింత నీరుగార్చింది. గెలుపోటములు సహజమేనని, పార్టీని ముందుండి నడిపించాలని ఎంతోమంది సీనియర్లు నచ్చజెప్పినా రాహుల్ ఒప్పుకోవడం లేదు. తాను పార్టీ పగ్గాలు చేపట్టే ప్రసక్తే లేదని కుండబద్దలు కొడుతున్నారు. అయితే, రాహుల్ గాంధీ తర్వాత ఎవరు పార్టీని నడిపిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రియాంక గాంధీ అయితే బాగుంటుందని చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారిలో ఒకరు ఆ పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్. ఈ నేపథ్యంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ గాంధీ కుటుంబం కాకుండా వేరే వాళ్లు పార్టీ పగ్గాలు చేపడితే కేవలం 24 గంటల్లోనే పార్టీ రెండుగా చీలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 134 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పార్టీ చీఫ్ లేకుండా ఉండటం నిజంగా దురదృష్టమని, గాంధీ కుటుంబం నుంచి తప్ప, వేరే వాళ్లు పగ్గాలు చేపడతారని తాను భావించడం లేదని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే సత్తా ప్రియాంక గాంధీకి ఉందని నట్వర్ వ్యాఖ్యానించారు. ‘గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టబోరని రాహుల్ స్పష్టం చేశారు. దీనిపై ఆ కుటుంబమే ఒక నిర్ణయం తీసుకోవాలి. రాహుల్ తీసుకునే నిర్ణయం, ప్రియాంక వేసే అడుగుపైనే అంతా ఆధారపడి ఉంది’ అని ఆయన అన్నారు. కాగా, ఇంతకుముందు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి కూడా.. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని ఆకాంక్షించారు. 100 శాతం ఆమోదించదగ్గ నేత ఆమె అని కొనియాడారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గోవాలో ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోగా, కర్నాటకలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
July 22, 2019, 11:52 AM IST