ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వివరణ ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆయన చేసిన ప్రసంగం దుమారాన్ని సృష్టించింది. తెలుగు భాష కోసం నిధులు తెచ్చుకుని, ఇంగ్లీష్ మీడియం కోసం వినియోగిస్తారా? అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో రఘురామకృష్ణంరాజుపై సీఎం జగన్ సీరియస్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభలో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డితో కలసి రఘురామకృష్ణంరాజు సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా మూడు విషయాలపై సీఎం జగన్ ఆయనకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడడం, విజయసాయిరెడ్డికి తెలియకుండా ప్రధాని మోదీ, ఇతర నేతలను కలవడం వంటి విషయాలపై ఆయన రఘురామకృష్ణంరాజుకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.
అయితే, తాను కేవలం నియోజకవర్గ సమస్యల మీద తొలుత చర్చించామని, ఆ తర్వాత పార్లమెంట్‌లో తన స్పీచ్ వివాదంపై తనంతట తానే సీఎం జగన్‌కు వివరణ ఇచ్చానని రఘురామకృష్ణంరాజు మీడియాకు వెల్లడించారు. చక్కటి స్నేహపూర్వక వాతావరణంలో తమ మధ్య చర్చ జరిగినట్టు చెప్పారు. పార్లమెంట్‌లో ప్రసంగం విషయంలో తాను ఎక్కడా పార్టీ లైన్ దాటలేదని మరోసారి నర్సాపురం ఎంపీ స్పష్టం చేశారు. తాను బయటకు వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీ కూడా అటుగా వెళ్తున్నారని, తాను నమస్కారం చేయడంతో భుజం తట్టి వెళ్లిపోయారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే తనకు తెలుసని చెప్పారు.
వైసీపీ ఎంపీలు కొందరు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలకు రఘురామకృష్ణంరాజు కౌంటర్ ఇచ్చారు. ఏవైనా నియోజకవర్గ నిధుల విషయంలో మంత్రులను కలుస్తారే తప్ప.. రాజకీయంగా ఎవరూ టచ్‌లో లేరని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఎంపీ కూడా పార్టీ గీత దాటి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, MP raghurama krishnam raju