కొంతకాలంగా వైసీపీతో విభేదించి ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న నరసరాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. తాజాగా ఆ పార్టీ నేతలు చేస్తున్న రాజీనామా సవాళ్లకు కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న రఘురామకృష్ణంరాజు.. తాను ఎన్నికలకు వెళితే దాన్ని అమరావతిపై రెఫరెండంగా భావిస్తామని చెప్పాలని వైసీపీని డిమాండ్ చేశారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నిక జరిగితే కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ రమ్మంటేనే తాను వైసీపీలోకి వచ్చానని స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలకు కారణం ఎవరికీ తెలియదనని అన్నారు.
తాను రాజీనామా చేయాలని కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేయగా.. ఆయన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధమని అన్నారు. అదేమైనా రిఫరెండమా అని వ్యాఖ్యానించారు. తన రాజీనామాపై మంత్రులు వ్యాఖ్యలు చేస్తుండటంతో రఘురామకృష్ణంరాజు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. తాను తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నెగ్గితే... అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని సీఎం రాతపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధమేనా ? అని ఇటీవల ప్రకటించారు. తాజాగా తన రాజీనామా కారణంగా వచ్చే ఉప ఎన్నిక అమరావతిపై రిఫరెండంగా జరిగితే లక్ష మెజార్టీతో గెలుస్తానంటూ వైసీపీపై తన మాటల దాడిని మరింతగా పెంచారు.
Published by:Kishore Akkaladevi
First published:September 13, 2020, 15:06 IST