ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మేనిఫెస్టోను విడుదల చేశారు. పది అంశాలతో కూడిన ఎన్నికల హామీలను ప్రకటించారు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు, ఆస్తిపన్నులు, పారిశుద్ధ్యం, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాలు, ఆటో డ్రైవర్లకు సౌకర్యాలు, మెప్మా గ్రూపులకు సాయం, గృహనిర్మాణం, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు, ఉచిత మంచినీరు వంటి హామీలిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు కష్టాలెదుర్కొంటున్నారని.. 21 నెలలుగా సీఎం జగన్ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని లోకేష్ విమర్శించారు. పట్టణ పేదల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ఎన్నికల్లో ముందుకెళ్తున్నామన్నారు. టీడీపీని గెలిపిస్తే హామీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేస్తామన్నారు.
టీడీపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో..
- మూతపడిన అన్నా క్యాంటీన్లు పున:ప్రారంభం.. పేదలకు రూ.5కే భోజనం
- ఆస్తి పన్నుల పాత బకాయిలు రద్దు.. ప్రస్తుత స్లాబులో సగమే విధింపు
- శుభ్రమైన ఊరు.. శుద్ధమైన తాగునీటి సరఫరా
- నిరుద్యోగ యువత కోసం ప్రతి 6 నెలలకు జాబ్ మేళా
- పట్టణాల్లో సుందరీకరణ మిషన్.. గతుకులు లేని రోడ్లు.. ప్రతివార్డులో పార్కులు.. ఓపెన్ జిమ్, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు
- ఆటో డ్రైవర్లకు టాయిలెట్లు, తాగునీటి సౌకర్యంతో ఉచితంగా శాశ్వత ఆటో స్టాండ్ల నిర్మాణం
- మెప్మా గ్రూపులకు సమావేశ మందిరాలు, మెప్మా బజార్లు, సున్నా వడ్డీ రుణాలు
- పట్టణ పేదలకు శాశ్వత గృహ నిర్మాణం.. టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టుల పూర్తి
- పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెంపు
- ప్రతి ఇంటికీ ఉచిత మంచిని కనెక్షన్.. నీటి పన్నుల రద్దు

టీడీపీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో
పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి మంచి ఆదరణ ఉందని.. గతంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని లోకేష్ అన్నారు. మెజారిటీ స్థానాలు టీడీపీ సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 21 నెలల పాలనలో కనీసం ఒక్క రోడ్డుగానీ, డ్రెయినేజీ కానీ నిర్మించలేదు. రోడ్లపై చెత్తకూడా ఎత్తడం లేదు. వీధి దీపాలు కూడా వేసే పరిస్థితి లేదని లోకేష్ విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ... పట్టణాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదని.. టిడ్కో ఇల్లు కట్టలేదని మండిపడ్డారు.
ఇక అమరావతిపై సీఎం జగన్ స్టాండ్ ఏంటో క్లియర్ గా చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, టిడ్కో, మౌలిక సదుపాయాలపై అవినీతి కేసులు వేస్తే కోర్టులు కోట్టేశాయని.. కనీసం అప్పీళ్లకు వేళ్లే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని ఆయన అన్నారు. సీఎం జగన్ పిరికివాడు గనుకనే ప్రత్యేక హోదా,స్టీల్ ప్లాంట్ కూడా వదిలేశారన్నాని ఆరోపించారు.