గత ఎన్నికల్లో తొలిసారి మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలైన నారా లోకేశ్... ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో... నారా లోకేశ్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఐదేళ్ల పాటు ఎదురు చూడకతప్పదని అంతా భావించారు. అయితే టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరందుకోవడంతో... మరోసారి లోకేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వంశీ వైసీపీలో చేరడం ఖాయమైతే... వైసీపీ పాలసీ ప్రకారం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకతప్పదు. అదే జరిగితే అక్కడ ఉప ఎన్నిక కూడా ఖాయమే.
అప్పుడు అక్కడ టీడీపీ తరపున పోటీ చేయబోయేది ఎవరనే అంశంపై అప్పుడే చర్చ మొదలైంది. టీడీపీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ తరపున నారా లోకేశ్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా మొదలైంది. అయితే వైసీపీ అత్యంత బలంగా ఉన్న ప్రస్తుతం సమయంలో జరగబోయే ఉప ఎన్నికల్లో నారా లోకేశ్ పోటీ చేస్తారా ? తనయుడి పొలిటికల్ కెరీర్‌తో చంద్రబాబు అంతటి రిస్క్ చేస్తారా ? అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.
టీడీపీకి బలం ఉండే గన్నవరం నియోజకవర్గంలో లోకేశ్ బరిలో నిలబడితే వైసీపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఓటమి చవిచూసిన లోకేశ్‌కు మరోసారి ఓటమి ఎదురైతే పరిస్థితి ఏంటనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి టీడీపీ బలంగా ఉన్న గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే లోకేశ్ పోటీ చేయకపోయినా... ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.