నారా లోకేశ్ కీలక నిర్ణయం... త్వరలోనే సైకిల్ యాత్ర ?

Nara lokesh | ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం తరువాత ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీడీపీని గట్టెక్కించే బాధ్యత చంద్రబాబు కంటే ఎక్కువగా లోకేశ్ మీదే ఉందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వయసురిత్యా చంద్రబాబు కంటే ఎక్కువగా పార్టీ కోసం లోకేశ్ కష్టపడాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు బాహాటంగానే అభిప్రాయపడుతున్నాయి.

news18-telugu
Updated: July 27, 2019, 7:20 PM IST
నారా లోకేశ్ కీలక నిర్ణయం... త్వరలోనే సైకిల్ యాత్ర ?
ఎన్నికల ప్రచారంలో లోకేష్ (Image : Lokesh Nara/Twitter)
  • Share this:
రాజకీయాల్లో నాయకుడిగా ఎదగడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నాయకులు ముందున్న ఏకైక మార్గం పాదయాత్ర. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తరువాత చంద్రబాబు, గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టి ప్రజలు ఆదరణ పొందారు. తద్వారా అధికారంలోకి కూడా రాగలిగారు. తాజాగా వీరి బాటలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఏపీ మాజీమంత్రి నారా లోకేశ్ కూడా నడవబోతున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం తరువాత ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీడీపీని గట్టెక్కించే బాధ్యత చంద్రబాబు కంటే ఎక్కువగా లోకేశ్ మీదే ఉందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

చంద్రబాబు వయసురీత్యా ఆయన కంటే లోకేశ్ ఎక్కువగా పార్టీ కోసం కష్టపడాల్సిన అవసరం ఉందని టీడీపీ శ్రేణులు బాహాటంగానే అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలోనే నిరాశలో కూరుకుపోయిన పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీలో సైకిల్ యాత్ర చేపట్టాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుతున్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

ఈ క్రమంలోనే సైకిల్ యాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పార్టీ కార్యకర్తలను పరామర్శించాలని లోకేశ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ రకంగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా టీడీపీని తాను ముందుకు నడిపించగలననే నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లో కలిగించవచ్చనే యోచనలో లోకేశ్ ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ట్విట్టర్ ద్వారా వైసీపీని తనదైన శైలిలో విమర్శిస్తున్న లోకేశ్... రాజకీయ కదనరంగంలోకి దూకడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు