బాలకృష్ణకు కీలకంగా మారిన ఎన్నికలు... అసలు కారణం ఇదే

త్వరలోనే జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కీలకంగా మారాయి. ఆయన ఇద్దరు అల్లుళ్లు ఈ సారి ఎన్నికల బరిలో నిలిచారు.

news18-telugu
Updated: March 29, 2019, 8:45 PM IST
బాలకృష్ణకు కీలకంగా మారిన ఎన్నికలు... అసలు కారణం ఇదే
బాలకృష్ణ, నారా లోకేశ్, శ్రీభరత్
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు... అటు టీడీపీకి ఇటు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మరోసారి అధికారంలోకి రావాలని టీడీపీ... ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు కీలకమైనవే అయినా... వారితో చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణకు కూడా ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. రెండోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న బాలకృష్ణ... తాను గెలవడంతో పాటు టీడీపీ తరపున తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన ఇద్దరు అల్లుళ్లు గెలవాలని బలంగా కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్న తన పెద్దల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్... మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. లోకేశ్ గెలుపు చంద్రబాబుతో పాటు టీడీపీకి కూడా ఎంతో కీలకంగా మారింది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలను పరిశీలించిన తరువాత తన కుమారుడిని మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. లోకేశ్‌తో పాటు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. విశాఖపట్నం ఎంపీగా శ్రీభరత్ పోటీకి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

శ్రీభరత్ తాత ఎంవీవీఎస్ మూర్తి గతంలో విశాఖ ఎంపీగా వ్యవహరించారు. మూర్తి వారసుడిగానే శ్రీభరత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా... ఆయన బాలకృష్ణ చిన్నల్లుడు కావడంతో... అందరి దృష్టి విశాఖపై పడింది. విశాఖలో ఈ సారి శ్రీభరత్ విజయం సాధిస్తేనే... మరోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీలో జరగబోయే ఎన్నికలు బాలకృష్ణ కుటుంబానికి అత్యంత కీలకంగా మారాయని చెప్పొచ్చు.First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు