• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • NARA CHANDRABABU NAIDU SAYS TDP MLAS MPS READY TO RESIGN FOR VIZAG STEEL PLANT ASKS YS JAGAN GOVT TO TAKE LEAD BA

Vizag Steel Plant: విశాఖ ఉక్కు కోసం చంద్రబాబు సంచలన ప్రకటన

Vizag Steel Plant: విశాఖ ఉక్కు కోసం చంద్రబాబు సంచలన ప్రకటన

చంద్రబాబునాయుడు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు కూడా రెడీగా ఉన్నామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడేందుకు తాము రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

  • Share this:
    తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు కూడా రెడీగా ఉన్నామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాకుండా కాపాడేందుకు తాము రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనకు చంద్రబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీనామాలపై ప్రకటన చేశారు. ‘ఉక్కు పరిశ్రమ కోసం పల్లా శ్రీనివాస్ 6 రోజులు దీక్ష చేశారు. విశాఖకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రజల భావోద్వేగాలను ప్రభుత్వం తెలుసుకోవాలి. మీకు (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) 22 మంది ఎంపీలు ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం మీరు ఏం చెప్పినా చేయడానికి మేం రెడీ. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజీనామాలకూ మేం సిద్ధం.’ అని చంద్రబాబునాయుడు ప్రకటించారు. విశాఖ ఉక్కు కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, తెన్నేటి విశ్వనాథం ఎంతో కృషి చేశారన్నారు.

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్ష చేపట్టి... వారం రోజులు అవుతుడడంతో అతడి ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో తెల్లవారుజామున పోలీసులు దీక్షను భగ్నం చేశారు. పల్లాను ఆస్పత్రికి తరలించారు. తరలింపు సమయంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు షీలానగర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆసుపత్రిలోనూ పల్లా దీక్షను కొనసాగిస్తున్నారు.

    విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికే విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఆ రాజీనామాపై మొదట విమర్శలు వచ్చాయి. ఆయన స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయలేదని వైసీపీ, బీజేపీ విమర్శించాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి రాజీనామా చేశారు. దాన్ని జర్నలిస్టుల ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపారు. దీనిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశం కావడంతో దీనిపై రాజకీయ వేడి రాజుకుంటోంది. తప్పు మీదంటే మీదంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను జగన్ చౌకధరకే కొట్టేద్దామనుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. అయితే, అసలు టీడీపీ హయాంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

    తాజాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పాదయాత్రకు సిద్ధమైనట్టు తెలిసింది. ఆయన 22 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా విశాఖలో పర్యటించనున్నారు.  ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. ముందుగా శారదాపీఠానికి చేరుకుంటారు. . అక్కడ శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. తరువాత నేరుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీని కలుస్తారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల భాటలో నడిపించాలి అంటే ఏం చేయాలి..? ఉద్యోగులు ఏమనుకుంటున్నారు?  కేంద్రం ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలి తదితర అంశాలపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీతో సీఎం జగన్ చర్చిస్తారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు