నందమూరి లక్ష్మీపార్వతికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పదవీ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఆమెను తెలుగు అకాడమీ చైర్ పర్సన్‌గా నియమించారు. అయితే, ఆ పదవితోపాటు మరో పదవిలో కూడా ఆమెను నియమించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సలహాదారుగా నియమించే అవకాశం ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు భాష మీద, కళా రంగం మీద లక్ష్మీపార్వతికి మంచి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో పరిచయానికి ముందు ఆమె సాహిత్యం, కళా రంగంలోనే ఉన్నారు. ఆమెకు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి మీద మంచి పట్టు ఉంది. దీంతో ఆమెను ఏపీ సాంస్కృతిక శాఖ సలహాదారుగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద గతంలో ఆమె కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును అండమాన్ జైలుకు పంపాలని ఉందని ఎన్టీఆర్ తనతో అనేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘ఎన్టీఆర్ చనిపోకముందు చివరి రోజుల్లో చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబును అండమాన్ జైలుకు పంపాలని ఉందని అనేవారు’ అని ఆమె వెల్లడించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం జగన్ సిట్ విచారణకు ఆదేశించారని, విచారణలో వాస్తవాలన్నీ బయటపడతాయని అన్నారు. నిజాలు బట్టబయలయ్యాక చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి జైలుకెళ్లడం తాను చూస్తానని ఆమె వ్యాఖ్యానించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.