సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో రసవత్తరంగా మారుతున్నాయి. తెల్లారితే ఏ నేత ఏ పార్టీ కండుకా కప్పుకుంటాడో తెలియని విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వర్‌రావు.. కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన టీడీపీకి రాజీనామా సమర్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానానికి మహకూటమి తరపున.. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నామా నాగేశ్వర్ రావు ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన గత కొంతకాలంగా టీడీపీతో అంటీ ముంటనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. దీంతో, ఆయన పార్టీ మారబోతున్నానే ప్రచారం ఊపందుకుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని ఊహాగానాలు వినిపించినా.. ఆయన మాత్రం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు.
ఈమేరకు సోమవారం నామానాగేశ్వర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. నామాను టీఆర్ఎస్ పార్టీ.. ఖమ్మం పార్లమెంటు స్థానంలో లేదా మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలో బరిలో దింపే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి నామాకు స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తోంది. మొదట్లో కేసీఆర్.. నామా చేరికకు సుముఖత వ్యక్తం చేయనప్పటికీ పలు రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరి, ఈ రెండు స్థానాల్లో నామా ఎక్కడ బరిలో నిలుస్తారో చూడాలి. ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న నామా నాగేశ్వర్రావు టీడీపీ తరపున 2009లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. 2014లో ఓటమి చవిచూశారు. అయితే, అనూహ్యంగా 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మహాకూటమి తరపున పోటీకి దిగినా.. ఓటమి తప్పలేదు. మరోసారి ఖమ్మం బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా తన అదృష్టాన్ని పరీక్షించుబోతున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి :-
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Khammam, Mahakutami, Tdp, Trs