Nagarjuna sagar: నాగార్జున సాగర్‌‌లో భారీగా పోలింగ్ నమోదు.. గెలిచేదెవరు?

నాగార్జున సాగర్‌లో ముగిసిన పోలింగ్

నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ బరిలో నిలిచారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 • Share this:
  నాగార్జున సాగర్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరోనా విజృంభిస్తున్నా... ఎండలు దంచికొండుతున్నా.. ప్రజలకు ఉత్సాహంగా ఓటువేశారు. పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్‌ ముగిసింది. 6 నుంచి 7 గంటల మధ్య కోవిడ్ బాధితులు ఓటు వేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటీ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. శానిటైజర్లతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలు పక్కగా అమలు చేశారు. మాస్క్ వేసుకుని వస్తున్న వారినే క్యూలోకి అనుమతించారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.

  నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటుహ‌క్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మ‌హిళ‌లు ఉన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో మొత్తం 86 శాతం పోలింగ్ అయింది. ఈసారి అంతకన్నా ఎక్కువ పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలతో పాటు మే 2న నాగార్జున సాగర్ ఫలితాలను ప్రకటిస్తారు.

  నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ బరిలో నిలిచారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు సానుభూతి ఓట్లు తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. నియోజకవర్గంలో జానారెడ్డికి ఎంతో పేరుందని.. ఆయన ఖచ్చితంగా గెలుస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తరహాలో.. సాగర్‌లోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగులుతుందని, తమ పార్టీయే గెలుస్తుందని బీజేపీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: