తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక వేడి రాజుకుంది. ఇక్కడ విజయం సాధించి సత్తా చాటాలని అన్ని ప్రధాన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సాగర్ పీఠానే తామే దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. దుబ్బాక మాదిరే సాగర్‌లోనూ టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా గెలిచి పూర్వ వైభవం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత జానా రెడ్డి బరిలో ఉన్నారు. ముందు నుంచీ ప్రచారంలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిచాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభమయింది. పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఐతే వైసీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రభ కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం వరకు నాగార్జున సాగర్ ఉపఎన్నికల కోసం మొత్తం 13 నామినేషన్లు దాఖలయినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అందులో 12 ఇండిపెండెంట్లు కాగా..మరొకరు వైసీపీ అభ్యర్థి అని వెల్లడించారు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య కొన్నేళ్లుగా స్నేహ బంధం కొనసాగుతోంది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా నేరుగా పోటీ చేకుండా.. వైసీపీ మద్దతు ఇస్తోందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ అనూహ్యంగా సాగర్ ఉపఎన్నికల్లో వైసీసీ అభ్యర్థి నామినేషన్ వేయడం చర్చనీయాంశమయింది. టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేందుకే వైసీీపీ ఈ నిర్ణయం తీసుకుందని కొందరు చెబితే.. ఓట్లను చీల్చి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేందుకు గేమ్ ఆడుతున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
సాగర్ ఉపఎన్నికల్లో 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అమవీరుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని.. కానీ స్వరాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోలేదని తెలంగాణ అమరువీరుల ఫోరం మండిపడింది. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకే సాగర్‌లో నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని..కానీ ఇప్పటి చాలా కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా అమరవీరుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ తరపున రవినాయక్ పోటీచేసే అవకాశమున్నట్లు సమాచారం.
నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలయింది. మార్చి 30 వరకు నామినేషన్లకు గడువు ఉంది. ఐతే మార్చి 27, 28, 29 తేదీలను ఈసీ సెలవుగా ప్రకటించడంతో.. మార్చి 25, మార్చి 30న మాత్రమే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈనెల 31వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. ఏప్రిల్ 3 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుంది. మే 2న ఐదు రాష్ట్రాల ఫలితాలతో పాటే నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nagarjuna sagar, Nagarjuna Sagar By-election, Telangana, Ysrcp