NAGARJUNA SAGAR ASSEMBLY AND TIRUPATI PARLIAMENT BY ELECTIONS TODAY POLITICAL PARTIES IN TENSION FULL DETAILS HERE HSN
Tirupati by Poll- Nagarjuna Sagar by Elections: నాగార్జున సాగర్, తిరుపతిలో నేడే పోలింగ్.. ఫలితాలు ఎలా ఉన్నా పార్టీల్లో అనూహ్య మార్పులు ఖాయం..!
ఏపీలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు
ఏపీలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి, తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు సవాల్ గా మారాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. వేసవి గాలుల కంటే అధికంగా రాజకీయ పరిణామాలే హీటెక్కిస్తున్నాయి. ఈ రోజు (శనివారం) జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ పైనే రాజకీయ నేతలంతా చర్చించుకుంటున్నారు. ఏపీలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి, తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు సవాల్ గా మారాయి. అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీలు అహర్నిశలు కష్టపడ్డాయి. గెలుపు ఎవరిని వరిస్తుందో? ఏ పార్టీని ప్రజలు అందలం ఎక్కిస్తారో? ఏ పార్టీకి అనూహ్య షాకులిస్తారో? అన్నదానిపై ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఫలితం ఏ పార్టీకి అనుకూలంగా వచ్చినా, ప్రతిపక్ష పార్టీల్లో అనూహ్య మార్పులు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీలో తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మృతితో అక్కడ ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సిగ్మెంట్లు, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడురు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. వాస్తవానికి ఈ ఏడు నియోజకవర్గాల్లో అధికార వైసీపీకే బాగా పట్టు ఉంది. అవి వైసీపీ కంచుకోటలే అని చెప్పవచ్చు. అందుకే దాదాపు 5 లక్షల మెజార్టీని సాధించాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఆ పార్టీ తరపున డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. బీజేపీ-జనసేన కూటమి తరపున రత్నప్రభ బరిలో ఉన్నారు. వైసీపీకి అనూహ్య షాకిచ్చేలా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితం ఉండాలని అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ పార్టీలు శతవిధాలా ప్రయత్నాలు చేశాయి. విస్తృతంగా ప్రచారం చేశాయి. హిందూ మతం సెంటిమెంట్ కూడా ప్రభావం చూపే ఈ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
ఇక తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా శనివారమే పోలింగ్ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ బరిలో ఉన్నారు. సానుభూతితోపాటు తాము చేస్తున్న అభివృద్ధి, పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్రానికి, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. 40వేల మెజార్టీతో మనమే గెలుస్తున్నామంటూ కామెంట్స్ కూడా చేశారు. గెలుపుపై అధికార పార్టీ ధీమాగా ఉంది. అయితే అదే సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ తరపున మాజీ మంత్రి జానారెడ్డి బరిలో ఉన్నారు. జానారెడ్డి గెలిస్తే తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులు ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ కు గట్టి షాకివ్వాలన్న పంతంతో కాంగ్రెస్ నేతలు సాగర్ లో ప్రచారం చేశారు. ఇక బీజేపీ కూడా గతంలో జరిగిన ఎన్నికల దూకుడును సాగర్లోనూ ప్రదర్శించింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలను సాగర్లోనూ రిపీట్ చేయాలని భావించింది. అందుకే ఆ పార్టీ కూడా పంతంతో పనిచేసింది. మరి ప్రజలు ఎవరికి ఓటేస్తారో? ఎవరిని గెలిపిస్తారో తెలియాలంటే ఫలితం కోసం కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.