రోజాకు ‘ఇంటి’పోరు... జగన్ పెద్దరికం.. నిర్ణయంపై ఉత్కంఠ

Roja Selvamani | ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణికి తన సొంత నియోజకవర్గం నగరిలో కిరికిరి తప్పేలా లేదు.

news18-telugu
Updated: March 25, 2020, 3:48 PM IST
రోజాకు ‘ఇంటి’పోరు... జగన్ పెద్దరికం.. నిర్ణయంపై ఉత్కంఠ
సీఎం జగన్, ఎమ్మెల్యే రోజా (Image:RojaSelvamani/Facebook)
  • Share this:
ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణికి తన సొంత నియోజకవర్గం నగరిలో కిరికిరి తప్పేలా లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రోజా కంటే ఆమెకు వ్యతిరేకంగా పనిచేసిన మాజీ మున్సిపల్ చైర్మన్‌కే పార్టీ నేతలు పెద్దపీట వేస్తున్నారని రోజా వర్గం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నగరిలో ఎమ్మెల్యే రోజా, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కేజే కుమార్ భార్య, సోదరుడు, మరో పది మంది అనుచరులు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయించారు. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా తన కుటుంబం అందించిన సేవలే తమను గెలిపిస్తాయని కేజే కుమార్ వర్గం ధీమాగా ఉంది. అందుకే తాము నామినేషన్లు వేశామని చెబుతున్నారు. పార్టీ బీఫాంలు కూడా తమకే వస్తాయని నమ్మకంగా ఉంది కేజే కుమార్ వర్గం. అదే సమయంలో ఇద్దరు మంత్రులు కేజే కుమార్‌ను కలిశారు. దీంతో నియోజకవర్గంలో రోజా పవర్ ఏమీ నడవడం లేదని, ఇద్దరు మంత్రులు కేజే కుమార్‌కు మద్దతివ్వడం అంటే రోజాను పక్కనపెట్టేసినట్టే ననే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం నేపథ్యంలో రోజా అలకవహించారు.

వ్యవహారం మరింత ముదరకముందే సర్దిచెప్పడానికి పార్టీ పెద్దలు ఇద్దరు నేతలను పంపారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తిగా పేరున్నభూమన కరుణాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. అయితే, నగరిలో తన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మీద రోజా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, నగరి నేతలతో తనకు పరిచయం ఉన్నా.. తాను ఎలాంటి వ్యతిరేక వర్గాలకు ప్రోత్సాహం ఇవ్వడం లేదని నారాయణస్వామి చెప్పినట్టు తెలిసింది. అలాగే, కేజే కుమార్ వర్గం కూడా ఆమెతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని నారాయణస్వామి రోజాకు చెప్పినట్టు సమాచారం. అయితే, కేజే కుమార్ అంశం జగన్ వద్దే తేల్చుకుంటానని రోజా చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడడంతో ఈ వ్యవహారం రానున్న రోజుల్లో రచ్చకు దారితీసే అవకాశం ఉంది.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు