సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చ.. కాంగ్రెస్ సీనియర్లపై రాహుల్ గాంధీ మధ్య ఆగ్రహం.. ఇప్పుడీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజేపీతో కుమ్మక్కయారని రాహుల్ గాంధీ విమర్శించడం.. నిరూపిస్తే రాజీనామా చేస్తానని గులాంనబీ ఆజాద్ అనడంతో పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నెలకొన్న తాజా పరిణామాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముస్లిం నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఎన్నాళ్లు బానిసలుగా ఉంటారని.. మీ సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.

గులాంనబీ ఆజాద్ మమ్మల్ని బీజేపీ బీ టీమ్ అని అనేవారు. కానీ ఆజాదే బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు అంటున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న ముస్లిం నేతలు సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వం కింద ఎన్నాళ్లు బానిసలుగా ఉంటారు.
— అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధినేత
సీడబ్ల్యూసీ సమావేశం వేదికగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొత్త అధ్యక్షడుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించాలని పార్టీ నేతలకు ఆమె విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మీ రాహుల్ గాంధీని కోరారు. మరికొందరు నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగితే బాగుంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ఇక పార్టీలో నాయకత్వ మార్పునకు సంబంధించి ఇటీవల 23 మంది నేతలు సోనియా గాంధీకు లేఖ రాయడంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా ఆస్పత్రిలో ఉన్న సమయంలో లేఖ ఎలా రాస్తారని.. బీజేపీతో కుమ్మక్కయ్యారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు CWC సమావేశంలో తీవ్ర దుమారంరేపాయి. ఆ లేఖతో తన తల్లి ఎందో బాధపడిందని ఆయన అన్నారు. ఐతే రాహుల్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఆ తర్వాత తన ట్వీట్‌ను వెనక్కి తీసుకున్నారు కపిల్ సిబల్.
Published by:Shiva Kumar Addula
First published:August 24, 2020, 16:40 IST