కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం.. అదేంటి సడెన్‌గా..

తెలిసీ తెలియక కేసీఆర్ మనసు నొప్పించి ఉంటే.. పెద్ద మనసుతో తమను మన్నించాలని ముషీరాబాద్ ఆర్టీసీ కార్మికులు తాజాగా విజ్ఞప్తి చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

news18-telugu
Updated: November 27, 2019, 1:26 PM IST
కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం.. అదేంటి సడెన్‌గా..
సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులు
  • Share this:
తెలంగాణ ఆర్టీసీ సమ్మె మొదలైన నాటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక లోకం ఆందోళనలు సాగించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌ వైఖరిని నిరసిస్తూ కార్మికులంతా తీవ్ర స్థాయిలో ఆయనపై విరుచుకుపడ్డారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని.. అందుకే ప్రైవేటీకరణకు మొగ్గుచూపుతున్నారని జేఏసీ నేతలు ఆరోపణలు చేశారు. డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇవ్వనిదే విధుల్లో చేరమని డెడ్‌లైన్లను కూడా లెక్క చేయలేదు. అయితే రాను రాను పరిస్థితిలో మార్పు వచ్చింది. హైకోర్టు,లేబర్ కోర్టు ప్రభుత్వానికే సానుకూలంగా తీర్పునివ్వడంతో జేఏసీ నేతలు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. సమ్మెను విరమించి బేషరతుగా విధుల్లో చేరుతామని.. ప్రభుత్వం అడ్డు చెప్పవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ఇష్టానుసారం సమ్మెకు వెళ్లి.. ఇష్టానుసారం విధుల్లో చేరుతామంటే ఎలా ఒప్పుకుంటామని ప్రభుత్వం ప్రశ్నించింది. దీంతో 48వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడ్డ పరిస్థితి. ఈ దుస్థితికి కారణం ఆర్టీసీ కార్మిక నాయకత్వమా? లేక ప్రభుత్వమా? అన్న చర్చ జరుగుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిన్న మొన్నటిదాకా సీఎం కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్న కార్మిక లోకం.. ఇప్పుడు ఆయన పట్ల ఓ మెట్టు దిగింది.

తెలిసీ తెలియక కేసీఆర్ మనసు నొప్పించి ఉంటే.. పెద్ద మనసుతో తమను మన్నించాలని ముషీరాబాద్ ఆర్టీసీ కార్మికులు తాజాగా విజ్ఞప్తి చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌పై కార్మిక లోకం భగ్గుమంటుంటే.. కొంతమంది కార్మికులు మాత్రం ఇలా సాఫ్ట్‌గా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం పట్ల మొండివైఖరి కంటే ఓ మెట్టు దిగైనా సరే ఉద్యోగాలు కాపాడుకోవాలన్న ఆరాటం వారి వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. మరి సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించిన కేసీఆర్.. కార్మికుల పాలాభిషేకానికైనా కరుగుతారా? లేదా అన్నది రేపటి కేబినెట్‌ భేటీతో తేలిపోనుంది.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>