జగన్ తరువాత వైసీపీలో అంతా తానై వ్యవహరించిన విజయసాయిరెడ్డి

AP assembly election results 2019: వైసీపీలోని అన్ని కీలక అంశాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అనేక అంశాల్లో జగన్ విజయసాయిరెడ్డిని ఎక్కువగా విశ్వసించారు.

news18-telugu
Updated: May 23, 2019, 10:31 AM IST
జగన్ తరువాత వైసీపీలో అంతా తానై వ్యవహరించిన విజయసాయిరెడ్డి
విజయసాయి రెడ్డి ఫైల్ ఫోటో(Image:Facebook)
  • Share this:
2014 ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి త‌రువాత పార్టీకి ఎంతో కీల‌కంగా వ్యవహరించిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా ఎన్నికల వేళ విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న వ్యవహరించిన వ్యూహాలు పార్టీకి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి. అవే జ‌గ‌న్ విజ‌యానికి ఎంత‌గానో కలిసొచ్చాయి. ప్రతి సందర్భంలోనూ అధికార‌పార్టీకి ఆయన తలనొప్పిగా మారారు. సూటిగా విమర్శలు చేయడంతో పాటు టీడీపీని వివిధ సందర్భాల్లో ఇరుకున పెట్టారు. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండే స‌మ‌యంలో విజయసాయిరెడ్డి ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో నిమగ్నపోయారు. పార్టీలో ఎన్నికల ముందు పెద్ద ఎత్తున చేరికలు జరగడంలోనూ విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.

దీంతోపాటు పార్టీకి, జగన్‌కు ఈ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి అదనపు బలంగా ఉపయోగపడ్డారు. సీనియర్ నేతలను కాదని విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించిన జగన్ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేదు. ఎంపీగా వెళ్లగానే ఢిల్లీలో పార్టీ వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి కీలకంగా మారారు. ప్రత్యర్థి టీడీపీపై పలు సందర్భాల్లో ఆయన మైండ్ గేమ్ ఆడారు. బీజేపీకి టీడీపీ దూరం కావడానికి విజయసాయిరెడ్డి కూడా ఒక కారణమే. విజయసాయిరెడ్డి పలుమార్లు ప్రధాని కార్యాలయంలో కనిపించడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల త‌రువాత పార్టీకి ప్రశాంత్ కిశోర్‌ను ప‌రిచ‌యం చేసింది విజ‌య‌సాయిరెడ్డే. పార్టీకి ఒక ఎన్నికల వ్యూహకర్త ఉంటే బాగుంటుంద‌ని సూచించ‌డంతో అప్పటికే మోదీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ వైసీపీకి సేవలందించే అవకాశం వచ్చింది.

వీటితో పాటు ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు నుంచి విజ‌య‌సాయిరెడ్డి వ్యవహరించిన తీరు కూడా అందరినీ ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ పార్టీలోకి వచ్చేందుకు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ వంటి సీనియర్ నేతలు ప్రయత్నాలు చేశారని... అయితే జగన్ తన అతివిశ్వాసం కారణంగా అప్పట్లో వారిని పార్టీలో చేర్చుకోలేదనే టాక్ ఉంది. అయితే అలాంటి త‌ప్పులు మ‌ళ్లీ జ‌గ‌న్ చేయ‌కుండా ఎన్నిక‌ల‌కు కొద్ది రోజులు ముందు పార్టీలోకి అధికార పార్టీ నుంచి చేరికలు పెద్ద ఎత్తున ఉండటంతో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇది అధికార పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతినడానికి ఉపయోగపడింది. దీంతోపాటు టీడీపీ వ్యవహరిస్తున్న తీరును ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్లే విషయంలోనూ ఆయనది ముఖ్యపాత్ర. విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఫిర్యాదుల ఆధారంగానే ఎన్నికలకు కొద్దివారాల ముందు ఇంటిలిజెన్స్ చీఫ్ బదిలీ అయ్యారనే వాదన ఉంది.

దీంతో పాటు జగన్‌ను టార్గెట్ చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉన్న మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకోవడంలో విజయసాయిరెడ్డి బాగా సక్సెస్ అయ్యారు. టీడీపీని, ఆ పార్టీ అనుకూల మీడియాగా ముద్రపడ్డ వారిని విమర్శించడంలో విజయసాయిరెడ్డి మిగతా వైసీపీ నేతలకంటే ముందున్నారు. ఈ విషయంలో వైసీపీ వ్యూహాలను అమలు చేయడంలో బాగా కష్టపడ్డారు. ఇలా అనేక రకాలుగా వైసీపీలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి... వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తారనే ప్రచారం జరుగుతోంది.
First published: May 23, 2019, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading