MP VIJAYASAI REDDY AS A ANCHOR ROLE IN AP BUNDH HE ASKED QUESTIONS TO CPM LEADERS NGS
Vizag Steel Plant: యాంకర్ గా మారిన విజయసాయి రెడ్డి: ఎందుకో తెలుసా?
యాంకర్ గా మారిన ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖ ఉక్కు ఉద్యమంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి.. ఏపీ బంద్ సందర్భంగా ఇంకాస్త యాక్టివ్ గా కనిపించారు. ఎవ్వరూ ఊహించని విధంగా యాంకర్ అవతారమెత్తారు?
విశాఖ ఉద్యమం సెగలు కక్కుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. సేవ్ స్టీల్ ప్లాంట్ అనే నినాదం మారుమోగుతోంది. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర బంద్ కు విశాఖ ఉక్కు ఉద్యమ సమితి పిలుపు ఇచ్చింది. బీజేపీ-జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంతో బంద్ విజయవంతమైంది..
ఇక అధికార పార్టీ సైతం బంద్ లో చురుగ్గా పాల్గొంది. ఎంపీలు, మంత్రులు అంతా బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంద్ లో పాల్గొన్న మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురు నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఒక్క విశాఖపట్నంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు చాలామంది బంద్ లో పాల్గొన్నారు.. ముఖ్యంగా మంత్రులు సైతం ఉద్యమంలో పాల్గొని నిరసన తెలపడం ఆసక్తికరంగా మారింది. కేంద్రానికి వ్యతిరేకంగా ఎప్పుడూ పల్లెత్తు మాట అనని వైసీపీ మంత్రులు నేతలు.. ఉక్కు ఉద్యమంలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది..
అయితే విశాఖ ఉద్యమంలో ఇతర నేతలకంటే విజయసాయి ముందే ఉన్నారు. ఇటీవల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన విశాఖ నగరంలో పాదయాత్ర చేపట్టారు. జీవీఎంసీ బిల్డింగ్ నుంచి.. స్టీల్ ప్లాంట్ గేట్ వరకు 25 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు మేరకు బంద్ లో చాలా ఉత్సాహంగా కనిపించారు.
విశాఖపట్నం మద్దిలపాలెం జంక్షన్ లో నిర్వహించిన మానవహారంలో రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మైక్ పట్టుకుని యాంకర్ గా మారారు. మానవహారంలో పాల్గొన్న వామపక్షాల నేతలతో.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడించారు. అందరి దగ్గరకు వెళ్లి మైకు పట్టుకుని వెళ్లి ప్రశ్నలు వేశారు. ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నలు వేస్తూ ఒక యాంకర్ లా వ్యవహించారు. దీంతో బంద్ లో విజయసాయిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సాధరణంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎంపీలు ఇలాంటి ఉద్యమంలో పాల్గోవడం చాలా అరుదు. అందులోనూ అందరికంటే ఉత్సాహంగా పాల్గొనడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నా.. విపక్షాలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నాయి.. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసమే ఇలాంటి ఫీట్లు చేస్తున్నారని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపంలో వైసీపీదీ భాగముందని మండిపడుతున్నాయి. వైసీపీ డ్రామాలను ప్రజలు ఎవరూ నమ్మరంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.